
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ రాజకీయ అవినీతి పెరిగింది
హెచ్‌ఎంఎస్‌తో కలసి సింగరేణి జాగృతి పనిచేస్తుంది
కార్మికులకు 37 శాతం బోనస్ ప్రకటించాలి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి అవినీతి గనిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యోగ నియామకాలతో పాటు అన్నింట్లో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయాలను రాత్రికి రాత్రే అమాంతం పెంచారని దుయ్యబట్టారు. సింగరేణిని కాపాడాలన్న ఉద్దేశంతో కేసీఆర్.. సంస్థలో రాజకీయ అవినీతిని అంతం చేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయ అవినీతి పెరిగిందని దుయ్యబట్టారు.
కార్మికులకు భరోసా ఇవ్వడానికి త్వరలో సింగరేణి యాత్ర చేపడతామని ప్రకటించారు. ఆదివారం బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ అయిన సింగరేణి జాగృతి, హెచ్‌ఎంఎస్ సంఘం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం కవిత విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణిని కాపాడుకోవాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ఎంతో కృషి చేశారని, ఇప్పుడు దాదాపు 40 వేల మంది ఉద్యోగులతో సింగరేణి కలకళలాడుతోందని అన్నారు. సింగరేణిలో భూగర్భ గనులను తెరవాలని డిమాండ్ చేశారు.
ఇచ్చేది తక్కువ.. పైగా పన్ను: సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చేది చాలా తక్కువగా ఉంటుందని, పైగా జీతంపై ప్రధాని మోదీ ఆదాయపు పన్ను కూడా విధిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 22 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసుల మేరకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత బోనస్ విషయంలో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం వంచనకు గురి చేసిందని, లాభాల్లో 33 శాతం వాటా బోనస్‌గా ఇస్తున్నామని చెప్పి అసలు లాభాలనే తక్కువ చేసి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి కార్మికులకు ఈ ఏడాది దసరా బోనస్‌గా లాభాల్లో 37 శాతం వాటా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘంతో కలసి సింగరేణి జాగృతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కలయిక భవిష్యత్తులో అన్ని వామపక్ష పార్టీల అనుబంధ సంఘాల ఐక్యతకు దారితీస్తుందని చెప్పారు. కాగా, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) తాను గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నానని, కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతీ ఒక్కరు కలసి పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు.