మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గం 

Justice L Nageswara Rao Suggestion Of Special Courts For Arbitration - Sakshi

కేసుల పరిష్కారంపై జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు వెల్లడి 

మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక కోర్టులు ఉండాలని సూచన 

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): కోర్టుల చుట్టూ తిరగడం కంటే కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే ఉత్తమ మార్గమని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు అభిప్రాయపడ్డారు. కిందికోరుల్లో, హైకోర్టు మధ్యవర్తిత్వం కోసం ప్రత్యేక న్యాయస్థానం ఉండాలని సూచించారు. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ అర్బిట్రేషన్‌ అండ్‌ మీడియేషన్‌ సెంటర్, ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వివాద పరిష్కార ప్రత్యామ్నాయం(ఏడీఆర్‌)పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ పాల్గొన్నారు. ఏడీఆర్‌ ఆవశ్యకతపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మాట్లాడుతూ.. చాలా వరకు మధ్యవర్తిత్వ అంశాల్లో ముఖ్య వ్యాజ్యదారుడిగా ప్రభుత్వమే ఉంటోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం 2015, 2019, 2021లో చేసిన సవరణల ప్రయోజనాన్ని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర్‌రావు వివరించారు. వివాద పరిష్కారానికి బదులు అసలు వివాదాలే రాకుండా దృష్టి సారించాలని సూచించారు.

తద్వారా వ్యాపార సంబంధాలు సరిదిద్దుకోవడం, కొనసాగించడం వంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అనంతరం ప్యానలిస్టులకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. దేశంలో ఏడీఆర్‌ యంత్రాంగం ఎలా మెరుగుపర్చాలనే అంశంపై సూచనలిచ్చారు. ఈ సదస్సులో తెలంగాణ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఏడీఆర్‌ రంగంలో ప్రాక్టీస్‌ చేస్తున్న న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేశంలో అతి సులభంగా వ్యాపారం నిర్వహించుకోవడానికి చట్టపరంగా ఉండాల్సిన సహకారం గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్‌పర్సన్‌ మురళీకృష్ణారెడ్డి, టెంపస్‌ లా ఫర్మ్‌ ఫౌండర్, భాగస్వామి సుందరీ ఆర్‌. పీసుపాటి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top