
రాకుంటే రాష్ట్ర కాలేజీలకే ప్రాధాన్యం
ఐఐటీలకు తగ్గిన పోటీ – పెరిగిన కటాఫ్
13 వేల ర్యాంకు వరకూ ఐఐటీల్లో సీటు
ముగిసిన ‘జోసా’ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) నిర్వహించిన కౌన్సెలింగ్ ఆరు రౌండ్లు పూర్తయింది. దీంతో ఐఐటీల్లో సీట్ల కేటాయింపు బుధవారంతో ముగిసింది. ఐఐటీల్లో 18,160 సీట్లుండగా.. వాటన్నింటినీ భర్తీ చేశారు. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో (నిట్)లో సీట్ల భర్తీకి మరికొన్ని రౌండ్లు ఉన్నాయి. జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 62,853 సీట్లున్నాయి. వాటికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించి ర్యాంకుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వీటిల్లో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయించారు. మిగతా సీట్లను జేఈఈ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేశారు.

పెరిగిన కటాఫ్
ఈసారి ఐఐటీల్లో కటాఫ్ ర్యాంకులు పెరిగాయి. కంప్యూటర్ కోర్సులకు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో 13 వేల లోపు ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. ఒక్క ముంబై ఐఐటీలో మాత్రం ఈ ఏడాదీ పోటీ కన్పించింది. సీఎస్‌ఈ బ్రాంచీకి ఐఐటీ హైదరాబాద్‌లో గత ఏడాది బాలురకు 656 ర్యాంకు వరకే సీటు వచ్చిం ది. తాజా కౌన్సెలింగ్‌లో 673 ర్యాంకు వరకూ సీటు వచ్చిం ది. ఇలా అన్ని ఐఐటీల్లోనూ ఇదే ట్రెండ్ కన్పించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కష్టంగా ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. దీంతో జేఈఈ మెయిన్స్ వరకే చాలామంది పరిమితమవుతున్నారు.

ఐఐటీలు కాకుండా నిట్ లేదా ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందేందుకు ఇష్టపడుతున్నారు. ఇది కూడా సాధ్యం కాకపోతే రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో టాప్ కేటగిరీలోని వాటికి ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ఈసారి రాష్ట్ర ఎప్‌సెట్‌లో 5 వేల ర్యాంక్ వచ్చిన వారూ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేశారు. నిట్‌లో కూడా సీఎస్‌ఈకి భారీ డిమాండ్ కన్పించింది. ఓపెన్ కేటగిరీలో గరిష్టంగా 6 వేల ర్యాంకు వరకే సీట్లు వచ్చాయి. కెమికల్ ఇంజనీరింగ్‌లో 30 వేల ర్యాంకుపైన కూడా సీట్లు వచ్చాయి.
నేడు రాష్ట్ర కాలేజీల్లో సీట్ల కేటాయింపు
తెలంగాణ ఎప్‌సెట్ తొలి దశ సీట్ల కేటాయింపు శుక్రవారం చేపడతారు. జోసా కౌన్సెలింగ్ పూర్తవ్వడంతో జాతీయ కాలేజీల్లో సీట్లు రానివారు రాష్ట్ర కాలేజీల్లో చేరే వీలుంది. రాష్ట్రంలో 76,795 ఇంజనీరింగ్ సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఇందులో 70 శాతం కంప్యూటర్, ఎమర్జింగ్ కోర్సుల్లోనే ఉన్నాయి. 94,354 మంది 59 లక్షలకు పైగా వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. దీంతో సీట్ల కేటాయింపు విద్యార్థులకు కీలకంగా మారబోతోంది.