వెయిటేజీ రద్దుతో నష్టం జరగదు

JNTU Arrangements To Conduct EAMCET - Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌

తెలంగాణలో 82, ఏపీలో 23 సెంటర్లు

కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలతో పరీక్ష

తగ్గించిన సిలబస్‌ ప్రకారమే ఎంసెట్‌లో ప్రశ్నలు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలతో ఎంసెట్‌ నిర్వహించేందుకు జేఎన్‌టీయూ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 4, 5, 6, 9, 10వ తేదీల్లో ప్రవేశ పరీక్ష జరగనుంది. కోవిడ్‌–19 వ్యాప్తి కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయడం, సిలబస్‌ తగ్గింపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంసెట్‌ను నిర్వహించాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. పరీక్ష జరగనున్న తీరు, చేస్తున్న ఏర్పాట్లు తదితర అంశాలపై ఎంసెట్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎ.గోవర్ధన్‌ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

ఇంటర్‌ పరీక్షల రద్దుతో వెయిటేజీ రద్దు 
గతేడాది వరకు ఇంటర్‌ మార్కులకు ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజీ ఉండేది. అయితే ఈసారి వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలను రద్దు చేయడంతో, వెయిటేజీని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. ఇలా వెయిటేజీ రద్దు చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేకంగా ఎలాంటి నష్టం జరగదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదు. పైగా సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు లేకపోవడంతో చాలామంది వెయిటేజీ రద్దును ఆహ్వానించారు.

ఎక్కువ ఆప్షన్లు ఉండవు
కరోనా కారణంగా ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో సిలబస్‌ను 70 శాతానికి కుదించారు. అందుకు అనుగుణంగానే ఎంసెట్‌లోనూ సిలబస్‌ తగ్గించి, ఆ ప్రకారమే ప్రశ్నలు ఇస్తున్నాం. మొదటి సంవత్సరానికి సంబంధించి 100 శాతం, రెండో ఏడాదికి 70 శాతం సిలబస్‌ను తీసుకున్నాం. ప్రశ్నలను మొదటి, రెండో ఏడాదికి సంబంధించిన సిలబస్‌ను బట్టి సాపేక్షికంగా ఇస్తాం. దీనివల్ల మొదటి ఏడాది ప్రశ్నలు సహజంగానే ఎక్కువ వస్తాయి. సిలబస్‌ను కుదించడం వల్ల జేఈఈ మాదిరిగా ఎక్కువ ఆప్షన్లను ఇవ్వడం లేదు.

గతేడాది కంటే తక్కువగా సెషన్లు
ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో వ్యవసాయ, మెడికల్‌ విద్యార్థుల కోసం పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మరొక సెషన్‌ ఉంటుంది. ఈసారి తక్కువ సెషన్లు పెట్టాం. గతేడాది ఇంజనీరింగ్‌కు 8 సెషన్లు పెడితే, ఈసారి 6 సెషన్లు పెడుతున్నాం. వ్యవసాయ, మెడికల్‌ కోర్సులకు గతేడాది నాలుగు సెషన్లు పెడితే, ఈసారి మూడు సెషన్లలోనే నిర్వహిస్తున్నాం. తెలంగాణలో 82 సెంటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 23 సెంటర్లలో పరీక్ష జరుగుతుంది. గతేడాది కంటే 27 వేల మంది ఎక్కువగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అందరూ ఇంటర్‌ పాస్‌ కావడం ఇందుకు కారణం కావొచ్చు.

మాస్క్‌ ధరించాలి.. శానిటైజర్‌ తెచ్చుకోవాలి
గతేడాది కంటే ఈసారి కరోనా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటున్నాం. విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. శానిటైజర్, 500 ఎంఎల్‌ వాటర్‌ బాటిల్‌ తెచ్చుకోవచ్చు. కోవిడ్‌కు సంబంధించి ప్రతి విద్యార్థి సెల్ప్‌ డిక్లరేష¯Œన్‌ ఫారం ఇవ్వాలి. జ్వరం, జలుబు ఉందా లేదా అనేది డిక్లరేషన్‌లో స్పష్టం చేయాలి. జ్వర పరీక్ష చేస్తాం. ఒకవేళ జ్వరం, జలుబు వంటివి ఉంటే ప్రత్యేక ఏర్పాటు చేస్తాం. పరీక్ష సమయానికి కోవిడ్‌ నిర్ధారణ అయినవాళ్లు ముందుగా ఈ–మెయిల్‌ ద్వారా తెలియ జేయాలి. కరోనా పాజిటివ్‌ అని ఉన్న రిపోర్ట్‌ను జత చేయాలి. ఇలాంటి వారికి తర్వాత పరీక్షలు పెట్టే అవకాశముంది. ఇలా ఎవరైనా నిర్ధారించిన తేదీల్లో పరీక్షకు హాజరుకాలేకపోతే, వారు కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలి. వారిని కూడా తదుపరి తేదీన జరిగే పరీక్షకు హాజరయ్యేలా అనుమతిస్తాం. 

మొత్తం 160 మార్కులకు పరీక్ష
మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు అర్హత సాధించాలంటే 40 మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అర్హత మార్కు ఉండదు. వారికి సున్నా మార్కు వచ్చినా సీటు పొందొచ్చు. పరీక్ష పేపర్‌ ఇంగ్లీషు–తెలుగు, ఇంగ్లీషు–ఉర్దూ, ఇంగ్లీష్‌లలో ఉంటుంది. అత్యధికంగా 1,96,500 మంది ఇంగ్లీషు పేపర్‌ ఒక్కటే ఆప్షన్‌గా ఇచ్చారు. 2018 నుంచి జేఈఈ పరీక్ష మాదిరి నార్మలైజేష¯Œన్‌ ప్రాసెస్‌ అనే పద్ధతిని పాటిస్తున్నాం. ఇది శాస్త్రీయంగా జరుగుతుంది. పేపర్‌కు స్కేలింగ్‌ ఉంటుంది. స్టాటిస్టికల్‌ ఫార్ములా ఉంటుంది. ఆ ప్రకారం మార్కులను లెక్కగట్టి ర్యాంకులను ప్రకటిస్తాం. కాబట్టి ఎవరికీ అన్యాయం జరగదు.

రెండు గంటలు ముందు నుంచే అనుమతి
ఈసారి హాల్‌ టికెట్‌తో పాటు పరీక్ష జరిగే కేంద్రం రూట్‌ మ్యాప్‌ను కూడా ఇస్తున్నాం. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తాం. 1.15 గంటల ముందు హాల్‌లోకి అనుమతిస్తాం. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం. మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాచ్‌లు అనుమతించరు. జర్కిన్లు వేసుకొని రాకూడదు. 

దరఖాస్తుకు నేడే చివరి తేదీ
ఫైన్‌తో కలిపి ఎంసెట్‌కు ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఏపీ నుంచి 50 వేల మంది, ఇతర రాష్ట్రాల నుంచి 1,400 మంది ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top