సీటు రాకుంటే వేటు! 

JEE Targets For SC And ST Gurukulam Teachers - Sakshi

ఎస్సీ, ఎస్టీ గురుకుల బోధకులకు జేఈఈ లక్ష్యాలు 

ప్రతి సీఓఈ నుంచి ర్యాంకులు రావాలని స్పష్టీకరణ

ఉత్తమ ఫలితాలు రాకుంటే తొలగించేందుకూ సిద్ధం 

ఉత్తర్వులు జారీ చేసిన ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు 

సాక్షి, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు తమ పరిధిలోని సీవోఈ (సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ)లకు జేఈఈ లక్ష్యాలు నిర్ధేశించాయి. అత్యుత్తమ ర్యాంకులు రాకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. ప్రతి సీఓఈ కనీసం 3 నుంచి 5 సీట్లు వచ్చేలా కృషి చేయాలని హెచ్చరించాయి. గతవారం జేఈఈ మెయిన్‌ ఫలితాలు వచ్చి న విషయం తెలిసిందే. అందులో ఈ రెండు సొసైటీల నుంచి 706 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 432, ఎస్టీ గురుకుల సొసైటీ నుంచి 274 మంది ఉన్నారు. తాజాగా ఈ విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు సన్నద్ధం చేయాలని ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. యుద్ధ ప్రాతిపదికన తరగతులు ప్రారంభించాలని సూచించాయి. వీటితో పాటు బోధకులు, ప్రిన్సిపాళ్లకు పలు రకాల నిబంధనలు విధించాయి. 

ర్యాంకులొస్తేనే ఉద్యోగం... 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు మరో పదిహేను రోజుల సమయం ఉండడంతో విద్యార్థులకు బోధన, అభ్యసన కార్యక్రమాలు పెంచుకోవాలని సొసైటీలు ఆదేశించాయి. ప్రతిరోజు ఒక్కో సబ్జెక్టును నాలుగు గంటల పాటు బోధించాలని సూచించాయి. మెయిన్‌ పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థులు అర్హత సాధించడంతో అడ్వాన్స్‌డ్‌లోనూ ఇదే తరహాలో ఫలితాలు ఉండాలని, లేకపోతే ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌ బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి.

ప్రస్తుత పరిస్థితిని పరీక్షా సమయంగా భావించి పనిచేయాలని సూచిస్తూ... ప్రిన్సిపాల్స్‌ స్థానికంగా ఉంటూ అడ్వాన్స్‌డ్‌ బోధన, అభ్యసన తీరును నిరంతరం పర్యవేక్షించాలన్నాయి. ఫలితాలు సంతృప్తికరంగా లేకుంటే బోధకులను విధుల నుంచి టర్మినేట్‌ చేస్తామని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ఆపరేషన్‌ విభాగం ఓఎస్‌డీ(ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌డ్యూటీ) జారీ చేసిన సంయుక్త ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ నిబంధన ఉపాధ్యాయుల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విధులను అత్యంత భయపడుతూ నిర్వహిస్తున్నామని, ఇలాంటి షరతులు పెడితే స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండదని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top