విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరాబాద్‌కూ ముప్పు! 

Jammu Drone Attack: Threat to Hyderabad Also - Sakshi

నగరంలోనే అనేక డిఫెన్స్‌ సంబంధిత ప్రాంతాలు

ఫంక్షన్లలో విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం

అనుమతులు పొంది వాడుతున్నవి అతితక్కువే

కాశ్మీర్‌లోని తాజా పరిణామాలతో కలవరపాటు

సాక్షి, హైదరాబాద్‌: జమ్మూకాశ్మీర్‌లో వరుసగా వెలుగులోకి వచ్చిన ‘డ్రోన్ల ఉదంతాలు’ రాజధానికి ఉన్న మప్పును చెప్పకనే చెబుతున్నాయి. ఇక్కడా డీఆర్డీఓ, ఎన్‌ఎఫ్‌సీ సహా అనేక రక్షణ సంబంధిత, సున్నిత సంస్థలు ఉండటం, డ్రోన్ల వినియోగం విచ్చలవిడిగా సాగుతుండటం కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అడపాదడపా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా.. పూర్తిస్థాయిలో కట్టడి మాత్రం సాధ్యం కావట్లేదు. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్‌లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు పదేపదే స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటి కి ఇది అవసరమైన విధంగా అమలుకావట్లేదు.  

చదవండి: ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు

నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నా... 
 కేంద్ర నిఘా వర్గాలు ఈ తరహా గగనతల దాడుల అంశంపై ఐదేళ్ల నుంచి పదేపదే హెచ్చరిస్తున్నాయి.  
 దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలకు ఆధారాలనూ నిఘా వర్గాలు సేకరించాయి.  
 పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబాకు చెందిన ఉగ్రవాది సయ్యద్‌ జబీయుద్దీన్‌ అన్సారీ అలియాస్‌ అబు జుందాల్, ఇండియన్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాది సయ్యద్‌ ఇస్మాయిల్‌ అఫాఖీ, ఖలిస్థాన్‌ మిలిటెంట్‌ నాయకుడు జక్తార్‌ సింగ్‌ తారాలను కేంద్ర నిఘా వర్గాలు విచారించిన నేపథ్యంలో ముష్కర సంస్థల గగనతల దాడుల వ్యూహం వెలుగులోకి వచి్చంది.  
 పాకిస్థాన్‌కి చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు బయటపెట్టారు.  
 పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు చెందిన ఓ వింగ్‌ ఈ ఉగ్రవాదులకు పారాచూట్‌ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న పోలీసులు రాజధానిలో అనధికారిక డ్రోన్లు, పారాగ్‌లైడర్లు, రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా పని చేసే ఎగిరే వస్తువులు, చిన్నపాటి మానవ రహిత విమానాల వినియోగించడంపై నిషేధాన్ని విధించారు.  
 దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ అనేక పెళ్లిళ్లు, శుభకార్యాల్లో డ్రోన్ల వినియోగం కనిపిస్తూ ఉంటోంది.  
  95 శాతం మంది ఎలాంటి అనుమతులు లేకుండానే ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీల కోసం వాడేస్తున్నారు. 
 ‘నగరంలో వీటి వినియోగంపై అనునిత్యం నిఘా ఉంచుతున్నాం. ఎవరైనా అనుమతి కోరినా ఆచితూచి జారీ చేస్తున్నాం. అనధికారికంగా వాడే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. అయితే కఠిన చట్టాలు లేని కారణంగా ప్రస్తుతానికి పెట్టీ కేసులు పెట్టాల్సి వస్తోంది’ అని నగర పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు.   

చదవండి: కరీంనగర్‌ సిగలో మరో తీగల మణిహారం, కేబుల్‌ బ్రిడ్జికి సర్వం సిద్ధం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top