కరీంనగర్‌ సిగలో మరో తీగల మణిహారం, కేబుల్‌ బ్రిడ్జికి సర్వం సిద్ధం

Another Cable Bridge In Karimnagar After Hyderabad - Sakshi

అప్రోచ్‌ రోడ్లు పూర్తయితే రాకపోకలకు రెడీ  డిజిటల్‌ లైటింగ్‌ వంటి అదనపు  హంగులకు ప్రతిపాదనలు   

కనువిందు చేయనున్న తీగల వంతెన, మానేరు రివర్‌ ఫ్రంట్‌ అందాలు 

ఎంఆర్‌ఎఫ్‌కు రూ. 315 కోట్లు మంజూరు  

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హైదరాబాద్‌లో దుర్గం చెరువు తర్వాత.. కరీంనగర్‌ సిగలో మెరిసేందుకు మరో తీగల మణిహారం సిద్ధమైంది. రూ.149 కోట్ల వ్యయంతో మానేరు నది మీద 500 మీటర్ల పొడవున నాలుగు వరుసల రహదారి గల ఈ తీగల వంతెన (కేబుల్‌ బ్రిడ్జి) పర్యాటకులను విశేషంగా ఆకర్షించనుంది. ఇటీవలే రూ.315 కోట్లు మంజూరైన మానేరు రివర్‌ ఫ్రంట్‌ (ఎంఆర్‌ఎఫ్‌) ఈ తీగల వంతెన కిందనే కనువిందు చేయనుంది. హైదరాబాద్‌లో శరవేగంగా నిర్మాణం పూర్తయిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి కన్నా ముందే కరీంనగర్‌ తీగల వంతెన పనులు మొదలైనప్పటికీ.. వివిధ కారణాల వల్ల పూర్తికావడంలో ఆలస్యమైంది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జికి సంబంధించి లోడ్‌ టెస్టింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. అప్రోచ్‌ రోడ్డు పనులు కూడా పూర్తిచేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో అధికారులు కృషి చేస్తున్నారు.
 
కరీంనగర్‌–వరంగల్‌ రహదారిగా.. 

కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్లాలన్నా, వరంగల్‌ వెళ్లాలన్నా మానేర్‌ డ్యాం దిగువన ఉన్న అలుగునూరు బ్రిడ్జి ఒక్కటే దిక్కు. పెరిగిన ట్రాఫిక్‌ను ఈ నాలుగు వరుసల రహదారి తీర్చలేకపోతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్‌–వరంగల్‌ రహదారిగా మానేరు నది మీదే మరో బ్రిడ్జి నిర్మించాలన్న సంకల్పమే తీగల వంతెనకు నాంది పలికింది. కరీంనగర్‌ కమాన్‌ నుంచి హౌసింగ్‌ బోర్డు మీదుగా మానేరు నది దాటి మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని సదాశివపల్లికి వెళితే.. అక్కడి నుంచి వరంగల్‌ హైవేకు లింక్‌ అవుతుంది. తద్వారా వరంగల్‌కు ఏడు కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సాధారణ బ్రిడ్జి కన్నా పర్యాటకులను ఆకర్షించేలా కేబుల్‌ బ్రిడ్జి నిర్మించాలని, అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. నిర్మాణం పనులు కొంత మందకొడిగా సాగినా ఎట్టకేలకు పూర్తయింది.

ముగిసిన లోడ్‌ టెస్టింగ్‌
శుక్రవారం ప్రారంభమైన వంతెన సామర్థ్య పరీక్షలు మంగళవారం ముగిశాయి. తొలుత శుక్ర, శనివారాల్లో వంతెనకు ఇరువైపులా 28 టిప్పర్లను నిలిపి.. ఒక్కో దానిలో 30 టన్నుల ఇసుకను నింపారు. మొత్తం 840 మెట్రిక్‌ టన్నుల బరువుతో బ్రిడ్జి సామర్థ్యాన్ని పరీక్షించారు. అలాగే వంతెన ఇరువైపులా నిర్మించిన ఫుట్‌పాత్‌లపై మరో 110టన్నుల ఇసుక సంచు లను వేశారు. వంతెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను ఉంచి మొత్తం 950 టన్నుల బరువును పరీక్షించారు. సోమ, మంగళవారాల్లో కూడా 20 వాహనాల్లో ఇసుకను నింపి, ఫుట్‌పాత్‌లపై ఇసుక బస్తాలు పెట్టి వంతెన సామర్థ్యాన్ని అంచనా వేశారు.

అప్రోచ్‌ రోడ్లు పూర్తయితే..  
కేబుల్‌ బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్‌ రోడ్లతో పాటు కనెక్టివిటీ రోడ్లు నిర్మించాల్సి ఉంది. ఇందుకోసం రూ.34కోట్లను వెచ్చించనున్నారు. కరీంనగర్‌ కమాన్‌ నుండి కేబుల్‌ బ్రిడ్జి వరకు, అలాగే ఈ బ్రిడ్జి నుంచి సదాశివపల్లి వరకు అప్రోచ్‌ రోడ్ల నిర్మాణం జరగాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే తీగల వంతెన అందాలను వీక్షిస్తూ వాహనాలను మానేరు దాటించవచ్చు. 

ఉత్తర తెలంగాణకు గేట్‌ వేగా కరీంనగర్‌ 
తీగల వంతెనతో కరీంనగర్‌ సరికొత్త శోభ సంతరించుకుంటుంది. పర్యాటకంగా ఇప్పటికే మానేరు డ్యాం, ఎలగందుల ఖిల్లా వివిధ ప్రాంతాల వాసులను ఆకర్షిస్తున్నాయి. కరీంనగర్‌ అభివృద్ధికి ముఖ్యమంత్రి చూపించిన చొరవను ప్రజలు మరువలేరు. ‘సీఎం హామీ’పేరుతో ఏటా రూ.100 కోట్లు ఇచ్చిన కేసీఆర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో కరీంనగర్‌ను చేర్చి దీని రూపురేఖలే మార్చేశారు. తాజాగా కేబుల్‌ బ్రిడ్జి, మానేరు రివర్‌ ఫ్రంట్‌లు అదనపు సొబగులు అద్దనున్నాయి. వీటి నిర్మాణంతో ఉత్తర తెలంగాణకు కరీంనగర్‌ గేట్‌వేగా మారనుంది.  
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top