
రాష్ట్ర బీజేపీ సారథి ఎంపికకు మరికొన్ని రోజులు పట్టే చాన్స్
కశ్మీర్‌లో ఉగ్రదాడితో పార్టీ అగ్ర నాయకత్వం దృష్టంతా అటే..
జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా పెండింగ్‌లోనే..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు ఇంకా కొన్నిరోజులు సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అధ్యక్షుడితో పాటు ఏపీ తదితర రాష్ట్రాల అధ్యక్షులు అలాగే, జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా..ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. తాజాగా కశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఈ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. పహల్గాంలో 28 మంది పర్యాటకులు చనిపోవడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. పాలనా పరంగా, రాజకీయంగానూ కుదిపేసింది.
ప్రభుత్వంలో, పార్టీలో కీలకమైన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పూర్తిగా..పహల్గాం ఉగ్రదాడి తదనంతరం పరిణామాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ సంస్థాగత అంశాలు, రాజకీయపరమైన విషయాలను ఇప్పట్లో పట్టించుకునే అవకాశం లేదని, కొత్త జాతీయ అధ్యక్షుడి విషయంలో మరి కొంతకాలం వేచిచూడక తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక కూడా ముడిపడి ఉన్నందున, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కూడా ఆలస్యం అవుతుందని చెబుతున్నారు.
కొత్త అధ్యక్షుడికి అన్నీ సవాళ్లే..!
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనా సంస్థాగతంగా, రాజకీయంగానూ కొన్ని సమస్యలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఈ బాధ్యతలు చేపట్టగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల ప్రక్రియపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని అంటున్నారు. పార్టీలో గ్రూపులు పెరగడంతో.. సొంత ముద్రతో క్యాడర్‌ను తమ వైపు తిప్పుకోవడమూ సవాళ్ళతో కూడుకున్నదేననే చెబుతున్నారు.
మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా (2028) పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడం ద్వారా పార్టీ బలాన్ని చాటడం కొత్త అధ్యక్షుడికి పెద్ద సవాల్‌గానే నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేడర్‌లో నిరాసక్తత!
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగకపోవడం, పార్టీ కార్యక్రమాలు పెద్దగా లేకపోవడంతో.. పైకి బాగానే కనిపిస్తున్నా కేడర్‌లో లోలోపల నిరాసక్తత, నిర్లిప్తత చోటు చేసుకుందని అంటున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా పెద్దగా కార్యాచరణ ఏదీ లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. రాజకీయ కార్యకలాపాలు జోరుగా సాగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఎవరికి వారు తమ సొంత ఇమేజీని పెంచుకోవడంపైనే దృష్టి పెడుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.