ISB Hyderabad: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు

ISB Hyderabad Number 1 in India: Establishment, Placements, Ranking - Sakshi

2 క్యాంపస్‌లున్న బిజినెస్‌ కళాశాల

గచ్చిబౌలి, మొహాలీలలో క్యాంపస్‌లు

26న ప్రధాని నరేంద్ర మోదీ రాక 

స్నాతకోత్సవం, వార్షికోత్సవం నిర్వహణ 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది నగరంలోని ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌’ (ఐఎస్‌బీ). దేశంలోనే నెంబర్‌ 1 స్థానంలో నిలిచింది ఈ కళాశాల. గురువారం ఐఎస్‌బీ స్నాతకోత్సవం, వార్షికోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయనుండటం దీని ప్రాధాన్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఐఎస్‌బీ విశిష్టతలపై ప్రత్యేక కథనం ఇదీ.. 

స్థాపన ఇలా.. 
► ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సహకారంతో పలువురు వ్యాపారవేత్తలు నగరంలోని గచ్చిబౌలిలో 260 ఎకరాల విస్తీర్ణంలో 1999 డిసెంబర్‌ 20న ఐఎస్‌బీని ఏర్పాటు చేశారు. ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌కు అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ శంకుస్థాపన చేశారు. ఇది లండన్‌ బిజినెస్‌ స్కూల్, వార్టన్‌ బిజినెస్‌ స్కూల్, కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్, లండన్‌ బిజినెస్‌ స్కూళ్లతో భాగస్వామ్య సంబంధాలు కలిగి ఉంది.  

► ఐఎస్‌బీకి దేశంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, పంజాబ్‌లోని మొహలీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేశారు. ఇది ఏఎంబీఏ, ఈక్యూయూఐఎస్, ఏఏసీఎస్‌బీల ద్వారా అక్రిడిటేషన్ల ‘ట్రిపుల్‌ క్రౌన్‌’ పొందిన ప్రపంచంలోని 100వ కళాశాలల్లో ఐఎస్‌బీ ఒకటి. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ క్యాంపస్‌కు ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. 930 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు.  

అప్పట్లో ప్రముఖుల సందర్శన.. 
ఐఎస్‌బీ గచ్చిబౌలి క్యాంపస్‌ను డిసెంబర్‌ 2, 2001న అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రారంభించారు. 2006 డిసెంబర్‌ 5న డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ క్యాంపస్‌కు విచ్చేశారు. 2006 మార్చి 1న అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ సందర్శించారు. 2002 జనవరి 2న సింగపూర్‌ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ నాథన్‌ పరిశీలించారు. 2002 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఐఎస్‌బీ క్యాంపస్‌ను సందర్శించారు. (క్లిక్‌: బేగంపేటలో మోదీ స్వాగత సభ?)


ప్రపంచంలో 38వ స్థానం.. 

ఐఎస్‌బీ తాజాగా 2022లో ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కస్టమ్స్‌ ప్రోగ్రామ్స్‌ ర్యాంకింగ్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌లో ప్రపంచంలోనే 38వ స్థానం పొందింది. ఇండియాలోనే నెంబర్‌ వన్‌ బిజినెస్‌ స్కూల్‌గా కూడా ర్యాంకింగ్‌ను సాధించింది. ఎఫ్‌టీ ర్యాంకింగ్, అధిక– నాణ్యత పరిశోధన, విద్య కోసం భారతదేశాన్ని ప్రపంచ మ్యాప్‌లో ఉంచింది. ఇదిలావుండగా ఐఎస్‌బీ ఫ్యూచర్‌ యూస్‌ పారామీటర్‌లో అంతర్జాతీయంగా 7వ స్థానంలో నిలిచింది. 

‘డీ ల్యాబ్స్‌’తో నూతన ఆవిష్కరణలు..  
ఐఎస్‌బీలోని గచ్చిబౌలి క్యాంపస్‌లో డీ ల్యాబ్స్‌ పేరిట నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని 2015లో ప్రారంభించారు. దీంట్లో ఇప్పటి వరకు 125కు పైగా స్టార్టప్‌లను వివిధ రంగాలలో ఏర్పాటు చేశారు. దీనికి అంతర్జాతీయ ఇంక్యుబేటర్‌ నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవలే కేంద్రం రూ.5 కోట్ల నిధులను స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌కింద మంజూరు చేసింది.70 స్టార్టప్‌లకు దాదాపు 350 కోట్ల నిధుల సేకరణ కోసం స్టార్టప్‌లు ముందంజ వేశాయి. 


ప్లేస్‌మెంట్స్‌లోనూ టాపే.. 

► ప్లేస్‌మెంట్స్‌లోనూ ఐఎస్‌బీ దేశంలోనే టాప్‌గా నిలుస్తోంది.  ప్రతియేటా 100 శాతం విద్యార్థులు ఉద్యోగాలు పొందడం విశేషం. 2019–20లో ఏడాదికి సరాసరి వేతనం రూ.42 లక్షలు, అత్యల్పంగా రూ.24.10 లక్షల వేతనం, 20–21లో సరాసరి వేతనం రూ.72 లక్షలు, అత్యల్పంగా రూ.27 లక్షల వేతనం లభించింది. 2021–22లో సరాసరి వేతనం రూ.34.07 లక్షలుగా పొందారు. 

► 2019–20లో 1,504 ఆఫర్లు, 20–21లో 1,195 ఆఫర్లు, 2021–22లో 2,066 ఆఫర్లను విద్యార్థులు పొందారు.  (క్లిక్‌: మోదీ హైదరాబాద్‌ టూర్‌; ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోమ్‌

► అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, హనీవెల్, యాక్సిస్‌ బ్యాంక్, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్, జెన్‌ప్యాక్ట్, విప్రో, సీకే బిర్లా గ్రూపు, కేపీఎంజీ, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ లిమిటెడ్, టెక్‌ మహీంద్ర, డీబీఎస్‌ బ్యాంక్, డిలాయిట్‌ యూఎస్‌ఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ వంటి ప్రధాన కంపెనీలు ప్లేస్‌మెంట్‌లో పాల్గొన్నాయి. 


ఐఎస్‌బీ–20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని పాల్గొనడం విశేషం.. 

ఐఎస్‌బీ 20 ఏళ్ల వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. ఆయన హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌ల విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో మొక్కను నాటి స్మారక ఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఐఎస్‌బీ మై స్టాంప్, ప్రత్యేక కవర్‌ను విడుదల చేస్తారు. అకడమిక్‌ స్కాలర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పతకాలను కూ డా ప్రధాని చేతుల మీదుగా పంపిణీ చేస్తాం.
– ప్రొఫెసర్‌ మదన్‌ పిల్లుట్ల, ఐఎస్‌బీ డీన్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top