‘కొడంగల్‌’ లిఫ్టుపై మీమాంస | Irrigation Department ENC Anilkumar headed COT meeting | Sakshi
Sakshi News home page

‘కొడంగల్‌’ లిఫ్టుపై మీమాంస

Oct 20 2024 4:51 AM | Updated on Oct 20 2024 4:51 AM

Irrigation Department ENC Anilkumar headed COT meeting

టెండర్లను ఆమోదించని కమిషన్‌ ఆఫ్‌ టెండర్స్‌ 

లక్ష ఎకరాల ఆయకట్టుకు రూ.4,350 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు

రెండు ప్యాకేజీలుగా విభజించి గతనెలలో టెండర్ల ఆహ్వానం

సాక్షి,హైదరాబాద్‌: నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం టెండర్లకు కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌(సీఓటీ) ఆమోదముద్ర లభించలేదు. పలు ఇంజనీరింగ్‌ శాఖల పనులకు సంబంధించిన టెండర్లపై శనివారం నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ నేతృత్వంలోని సీఓటీ సమావేశమై చర్చించింది. 

ఈ సమావేశంలో నారాయణపేట–కొడంగల్‌ టెండర్లపై ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌తోపాటు నారాయణపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి రూ.4,350కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది.

టెండర్ల ఆమోదంపై నిర్ణయం తీసుకోని సీఓటీ
ప్రాజెక్టును రెండు ప్యాకేజీలుగా విభజించి గత నెల లో టెండర్లను ఆహ్వానించారు. ప్యాకేజీ–1 కింద రూ.1,134.62 కోట్ల అంచనాలతో టెండర్లను పిల వగా, 3.9% అధిక ధరను కోట్‌ చేసి రాఘవ–జ్యోతి జాయింట్‌ వెంచర్‌ ఎల్‌–1గా నిలిచింది. 4.85% అధిక ధరను కోట్‌ చేసి ఎల్‌–2గా మేఘా ఇంజనీ రింగ్‌ నిలిచింది. 

రూ.1,126.85 కోట్ల అంచనాలతో రెండో ప్యాకేజీ పనులకు టెండర్లను పిలవగా 3.95% అధిక ధరను కోట్‌ చేసి ఎల్‌–1గా మేఘా ఇంజనీరింగ్, 4.8% అధిక ధరను కోట్‌ చేసిన ఎల్‌–2గా రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ నిలిచాయి. ఈ టెండర్లను సీఓటీ ఆమోదించాల్సి ఉండగా, ఇప్పటికే పలుమార్లు సమావేశమైన సీఓటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. 

21న జరిగే సమావేశంలోనైనా...
ప్యాకేజీ–1 టెండర్ల విషయంలో సీఓటీలోని కొందరు చీఫ్‌ ఇంజనీర్లు కొన్ని అంశాలపై కొర్రీలు వేసినట్లు సమాచారం. ఈ నెల 21న జరగనున్న సీఓటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా నాగార్జునసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు రూ.360 కోట్లతో చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులకు సీఓటీ ఆమోదముద్ర వేసింది. రూ.14 కోట్లతో చేపట్టిన సదర్మట్‌ బరాజ్‌ విద్యుదీకరణ పనులకు సైతం అనుమతిచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement