తిండి తిప్పలు! తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు.. | Inspection Of Hotels Under Cyberabad Municipal Corporation Limits Hyderabad, Expired Ingredients Found In Top Restaurants | Sakshi
Sakshi News home page

తిండి తిప్పలు! తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు..

Jul 2 2026 1:40 PM | Updated on Jul 2 2026 2:18 PM

Inspection Of Hotels Under Cyberabad Municipal Corporation Limits Hyderabad

సీఎంసీలో అధ్వానంగా హోటళ్లు, రెస్టారెంట్లు

హోటళ్లలో కుళ్లిన మాంసం, సింథటిక్‌ రంగులు, గడువు తీరిన నిల్వలు

తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బెంబేలెత్తుతున్న నగరవాసులు

సాక్షి, హైదరాబాద్‌: బిర్యానీల సిటీ, ఐటీ హబ్‌గా పేరుగాంచిన సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థల హాస్టళ్ల వంటగదులు కల్తీ, నాసిరకం పదార్థాలతో నిండి ఉంటున్నాయి. నిగనిగలాడే లైటింగ్, ఏసీల నడుమ కస్టమర్లను ఆకర్షించే బడా రెస్టారెంట్ల వంటగదులు (కిచెన్లు) సైతం దారుణంగా ఉన్నాయి. ప్రముఖ విద్యాసంస్థల హాస్టళ్లలోనూ అపరిశుభ్రత తాండవిస్తోంది.  ఇటీవల సీఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు కార్పొరేషన్‌ పరిధిలోని ప్రముఖ హోటళ్లపై జరుపుతున్న వరుస తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి.  ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నయా మోసాలు, అధ్వాన్నపు నిర్వహణను అధికారులు ఎక్స్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేస్తుండటంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు.

  • మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ప్రధానంగా కుళ్లిన మాంసం, ఫ్రిజ్‌లలో వారాల తరబడి నిల్వ ఉంచిన, వాసన వస్తున్న చికెన్, మటన్, సీ–ఫుడ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. – చికెన్‌ బిర్యానీ, కబాబ్స్‌ మరింత ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించడం కోసం నిషేధిత సింథటిక్‌ రంగులను వాడుతున్నారు.

  • గడువు తీరిన సాస్‌లు, ఎక్స్‌పైరీ డేట్‌ దాటిపోయిన చీజ్, బట్టర్, చిల్లీ సాస్‌లను వంటల్లో ఉపయోగిస్తూ దొరికిపోయారు.

  • వంటగదుల్లో ఈగలు, బొద్దింకలు మాత్రమే కాకుండా, నిల్వ ఉంచిన పప్పులు, బియ్యం బస్తాలపై ఎలుకలు స్వైరవిహారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

లైసెన్సులు కూడా లేవు 
చాలా రెస్టారెంట్లకు చెల్లుబాటులో ఉన్న లైసెన్సులు కూడా లేవు. ఉన్నవారు సైతం  వాటిని ప్రదర్శించడం లేదు. వాటర్‌ అనాలిసిస్‌ రిపోర్టులు గానీ, సిబ్బంది  మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు గానీ అందుబాటులో లేవు. గతంలోనూ నగరవ్యాప్తంగా పలుమార్లు ఫుడ్‌ సేఫ్టీ రైడ్స్‌ జరిగాయి. అప్పట్లో కేవలం జరిమానాలతో సరిపెట్టడం వల్ల యాజమాన్యాల్లో మార్పు రాలేదని స్పష్టమవుతోంది.

బ్రాండెడ్‌ హోటళ్లలో ఘోరం! 
బడా బ్రాండ్లుగా చలామణి అవుతూ, వందల రూపాయల్లో ఛార్జ్‌ చేసే ప్రముఖ రెస్టారెంట్లలో సైతం విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఐటీ ఉద్యోగులతో నిరంతరం కిటకిటలాడే ఒక పేరెన్నికగన్న బిర్యానీ హోటల్‌లో మురిగిపోయిన చికెన్‌ ముక్కలను, ఫ్రిజ్‌లో దట్టంగా ఐస్‌ పేరుకుపోయిన పాత నిల్వలను అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లిలో కుటుంబ సమేతంగా వెళ్లే ఒక ఫేమస్‌ రెస్టారెంట్‌ కిచెన్‌లో సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ దొరికాయి. స్టోర్‌ రూమ్‌లలోని పప్పుల బస్తాల్లో ఎలుకల విసర్జితాలు కనిపించాయి. బేకరీ ఐటమ్స్‌ తయారీలో వాడే బట్టర్, చీజ్‌ ప్యాకెట్లపై కనీసం మాన్యుఫ్యాక్చరింగ్‌ డేట్‌ గానీ, ఎక్స్‌పైరీ డేట్‌ గానీ ఉండకపోవడాన్ని అధికారులు గుర్తించారు.

ఉప్పల్‌లో హోటల్‌కు రూ.25 వేల జరిమానా
మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంఎంసీ) ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు బుధవారం ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద ఉన్న మాస్టర్‌ చెఫ్‌రెస్టారెంట్‌లో భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించినందుకు రూ.25 వేల జరిమానా విధించారు. స్టోర్‌రూమ్, డైనింగ్‌ ఏరియాలో ఈగలు, బొద్దింకలు అధికంగా ఉండటం, మాంసాహార పదార్థాలను తగిన ఉష్ణోగ్రతలు, పరిశుభ్రత ప్రమాణాలు లేకుండా నిల్వ చేయడం.మూతలు లేకుండా ఉంచడం,కిచెన్‌ సిబ్బంది వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, చెత్తబుట్టలకు మూతలు లేకపోవడం, తదితర ఉల్లంఘనలు గుర్తించి జరిమానా విధించారు. యాజమాన్యానికి నోటీసు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

కుళ్లిన చేపలు, రొయ్యలు స్వాధీనం..
రసాయనాలతో కల్తీ చేస్తున్న నలుగురి అరెస్టు

అబిడ్స్‌: ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతూ..కుళ్లిన చేపలు, రొయ్యలు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద సోడియం బై కార్బోనేట్‌ రసాయనాలను మిక్స్‌ చేసిన 262 కిలోల వివిధ రకాల చేపలు, రొయ్యలు స్వా«దీనం చేసుకున్నారు. మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం..మచిలీపురా ప్రాంతంలో శంకర్‌ సింగ్‌ అనే వ్యక్తి మాన్‌సింగ్, గులాబ్‌సింగ్, రోహిత్‌ సింగ్‌లతో కలిసి తారా ఫిషరీష్‌ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.

వీరు బేగంబజార్‌ చేపల మార్కెట్‌ నుండి తక్కువ ధరకే నాసిరకం రొయ్యలు, చేపలు కొనుగోలు చేసి సోడియం బై కార్బొనేట్‌ రసాయనాలు కలిపి డీప్‌ఫ్రిజ్‌లు, ప్లాస్టిక్‌ డబ్బాల్లో నిల్వ ఉంచుతున్నారు. వీటిని ఫంక్షన్‌లకు, ఈవెంట్లకు, హోటళ్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందడంతో నగర టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస రావు పర్యవేక్షణలో గోల్కొండ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌, మంగళ్‌హాట్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర, ఇతర సిబ్బంది దాడులు నిర్వహించారు. నిందితులను అరెస్టు చేసి రూ.90 వేల విలువైన 100 కిలోల పాడైపోయిన రొయ్యలు, 162 కిలోల వివిధ రకాల చేపలు, 6 బస్తాల ఉప్పు, 10 కిలోల సోడియం రసాయనాలను స్వా«దీనం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement