రైళ్లిక రయ్‌.. గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు!

Indian Railways To Operate Trains At Speed Of 130 Kmph On Certain Routes - Sakshi

నిర్దిష్ట రూట్లలో గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నేటి నుంచే ప్రారంభం

సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్‌ డివిజన్లకు అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: రైలు అనగానే.. నెమ్మది ప్రయా­ణం, అనుకున్న సమయానికి గమ్యం చేరదన్న అభిప్రా­యమే మదిలో మెదులుతుంది. ఆ అపప్ర­దను చెరిపేస్తూ విప్లవాత్మక మార్పులతో దూసుకు­పోతున్న భారతీయ రైల్వే మరో చారిత్రక ఘనతను సాధించేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు విజయవంతం కావటంతో నిర్దిష్ట రూట్లలో రైళ్లు గరిష్ట వేగంతో దూసుకుపోయేందుకు అనుమతి లభించింది. దీంతో సోమవారం నుంచి ఆయా మార్గాల్లో సాధారణ రైళ్లు కూడా గంటకు 130 కి.మీ. వేగంతో పరుగులు పెట్టనున్నాయి.

మూడేళ్ల కసరత్తు తర్వాత.. 
దేశవ్యాప్తంగా రైళ్ల వేగాన్ని దశలవారీగా పెంచాలని నిర్ణయించిన రైల్వే అందుకోసం మూడేళ్లుగా కసరత్తు చేస్తోంది. రైలు మార్గాల్లో కీలకమైన స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ మార్గాల్లో తొలుత దీన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించి, ఆ మార్గాల్లో ట్రాక్‌లు 130 కి.మీ వేగాన్ని తట్టుకునేలా పటిష్టం చేసింది. కోవిడ్‌ సమయంలో రైళ్ల రాకపోకలపై నిషేధం ఉండటాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పటిష్టపరిచే పనులను వేగంగా పూర్తి చేసింది. ఇటీవలే ముంబయి, చెన్నై మార్గాల్లో కొన్ని రైళ్లు ఈ వేగంతో వెళ్లేలా అనుమతించిన రైల్వే, తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ అనుమతినిచ్చింది. 

ఏ డివిజన్‌లో ఏయే మార్గాలు..?
ప్రస్తుతం అన్ని మార్గాల్లో ఈ వేగం సాధ్యం కాదు, ట్రాక్‌ను పటిష్టప­రిచిన పరిమిత మార్గాల్లోనే ఇది సాధ్యమవు­తుంది. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోని సికింద్రా­బాద్‌–కాజీపేట–బల్లార్షా, కాజీపేట–కొండపల్లి సెక్ష­న్లు, విజయవాడ డివిజన్‌ పరిధిలోని కొండప­ల్లి–వి­జయవాడ–గూడూరు, గుంతకల్‌ డివిజన్‌ పరిధిలోని రేణిగుంట–గుంతకల్‌–వాడి సెక్షన్ల పరిధి­లో ఈ వేగానికి అనుమతించారు. ఈ మార్గాలు ని­త్యం అన్ని వేళలా రద్దీగా ఉండేవి కావడం గమనార్హం. 

ప్రస్తుతానికి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు..
ప్రీమియం రైళ్లుగా ఉన్న రాజధాని, దురొంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగాన్ని గత ఏప్రిల్‌లోనే 130కి పెంచారు. అప్పటివరకు అవి 120 వేగంతో వెళ్లేవి. సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇంతకాలం గంటకు 110 కి.మీ. వేగంతో వెళ్తూ వస్తున్నాయి. ఇప్పుడివన్నీ ఆయా రూట్లలో 130 కి.మీ. వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతానికి ప్యాసింజర్‌ రైళ్ల వేగం కొంత తక్కువే ఉండనుంది. ఎక్కువ స్టాపులుండటం, సిగ్నళ్ల పరిధి ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఇక గూడ్సు రైళ్లు కూడా ఇప్పుడు వేగంగా దూసుకుపోయేలా మార్చారు.

వాటిల్లో వ్యాగన్ల రకాన్ని బట్టి వేగంలో కొంత మార్పులుంటాయి. కొన్ని గంటకు 130 కి.మీ. వేగంతో, కొన్ని 100 కి.మీ, మరికొన్ని 80 కి.మీ. వేగంతో దూసుకుపోనున్నాయి. ప్రస్తుతం స్వర్ణ చతుర్భుజి, స్వర్ణ వికర్ణ (గ్రాండ్‌ ట్రంకు కారిడార్‌) మార్గాలు కాకుండా త్వరలో మరిన్ని కారిడార్లను కూడా పటిష్టం చేసి మిగతా రూట్లలో కూడా రైళ్లను 130 కి.మీ. వేగంతో నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top