సంక్రాంతి ప్రయాణం కష్టమే.. | Heavy Festive Rush: Hyderabad Trains Fully Booked, 150 Special Trains Added for Diwali & Sankranti | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ప్రయాణం కష్టమే..

Oct 12 2025 1:02 PM | Updated on Oct 12 2025 1:23 PM

Indian Railways gears up for festival rush

 రైళ్లకు భారీ డిమాండ్‌ 

వందల్లో వెయిటింగ్‌ లిస్ట్‌ 

శబరి ఎక్స్‌ప్రెస్‌లో నోర్త్‌..

పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు 

ఫ్లైట్‌ చార్జీలు సైతం పైపైకి.. 

సిటీ నుంచి పెరగనున్న రద్దీ  

సాక్షి, హైదరాబాద్‌ : వందల్లో రైళ్లు. వేలల్లో బెర్తులు. అయినా తప్పని నిరీక్షణ. పండుగలు, పెళ్లిళ్లు, వరుస సెలవులు, శుభకార్యాలు, అయ్యప్ప భక్తుల శబరి పర్యటనల రద్దీతో రైళ్లకు అనూహ్యంగా డిమాండ్‌ పెరిగింది. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లోకి చేరింది. కొన్ని రైళ్లలో ‘నో రూమ్‌’ దర్శనమిస్తోంది. సాధారణ రోజుల్లో కంటే  ప్రత్యేక సందర్భాల్లో హైదరాబాద్‌ నుంచి ప్రయాణికుల రద్దీ సహజంగానే రెట్టింపవుతోంది. ఇందుకనుగుణంగా వివిధ మార్గాల్లో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.  

అదనంగా సుమారు 150 రైళ్లు.. 
దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి వంటి పండుగలు, వరుస సెలవుల దృష్ట్యా అన్ని రెగ్యులర్‌ రైళ్లలో భారీ డిమాండ్‌ నెలకొంది. సికింద్రాబాద్, చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కోల్‌కతా, చెన్నై, శబరి, దానాపూర్, పటా్న, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికుల జాబితా గణనీయంగా పెరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు ఈ డిమాండ్‌ అధికమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక రైళ్ల నిర్వహణకు ప్రణాళికలను రూపొందించారు. వివిధ మార్గాల్లో సుమారు 150 రైళ్లను అదనంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.  

సంక్రాంతి ప్రయాణం కష్టమే..  
సంక్రాంతికి 25 లక్షల నుంచి 30 లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారని అంచనా. రైళ్లు, ఆరీ్టసీ, ప్రైవేట్‌ బస్సులతో పాటు సొంత వాహనాల్లోనూ ఎక్కువ మంది బయలుదేరుతారు. కాగా.. ఇప్పటికే కొన్ని రూట్లలో డిమాండ్‌ మేరకు అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. అయినా రోజురోజుకూ ప్రయాణికుల డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్‌ల నుంచి బయలుదేరే విశాఖ, ఫలక్‌నుమా, కోణా ర్క్, నాందేడ్‌ సూపర్‌ఫాస్ట్, ఈస్ట్‌కోస్ట్, గరీబ్‌రథ్, దురంతో తదితర రైళ్లలో 100 నుంచి 150 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ నమోదు కావడం గమనార్హం.  

కాకినాడ వైపు వెళ్లే గౌతమి, నర్సాపూర్‌ తదితర రైళ్లలోనూ వెయిటింగ్‌ లిస్ట్‌  100 వరకు నమోదైంది. సికింద్రాబాద్‌ నుంచి దానాపూర్‌ వరకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌కు దీపావళ్లి రద్దీ పోటెత్తింది. ఈ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి ముజఫర్‌నగర్‌కు కొత్తగా అమృత్‌భారత్‌ను ప్రవేశపెట్టినప్పటికీ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రయాణికుల డిమాండ్‌ ఏ మాత్రం తగ్గలేదు. దీపావళి వేడుకల కోసం నగరం నుంచి యూపీ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లోని సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు రైళ్ల కోసం ఇప్పటి నుంచే పడిగాపులు కాస్తున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకూ దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు రద్దీ భారీగానే ఉండనుందని అధికారులు భావిస్తున్నారు.  

విమాన చార్జీల మోత.. 
మరోవైపు దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ఎయిర్‌లైన్స్‌ చార్జీలను రెట్టింపు చేశాయి. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, నాగ్‌పూర్‌ తదితర నగరాలకు చార్జీలు అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రూ.6000 వరకు చార్జీలు ఉంటే ఈ నెల 18, 19, 20 తేదీల్లో రూ.9000 నుంచి రూ.12000 వరకు పెంచారు. జైపూర్‌ రూ.7000 నుంచి ఏకంగా రూ.15000 వరకు చార్జీలు పెరిగాయి. కోల్‌కతాకు రూ.5000 నుంచి  రూ.7000 వరకు ఉంటుంది. దీపావళి దృష్ట్యా ప్రస్తుతం రూ.12000 వరకు పెరిగినట్లు ట్రావెల్స్‌ సంస్థల ప్రతినిధులు చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement