
గత జూన్‌లో భూగర్భ జలమట్టాల్లో స్వల్ప వృద్ధి
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్రంలో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి ప్రారంభమైంది. జూన్‌లో రాష్ట్ర భూగర్భ జలాల సగటు మట్టం 9.47 మీటర్లకు చేరింది. వేసవిలో సాగు, తాగు, ఇతర అవసరాలకు బోరుబావుల నుంచి విచ్చలవిడిగా నీళ్లను తోడుకోవడంతో గత ఏప్రిల్ చివరి నాటికి భూగర్భ జలాల సగటు మట్టం 10.17 మీటర్ల లోతుకి దిగజారిపోయింది. ముందస్తుగా రుతుపవనాల రాకతో ఆ తర్వాతి మేలో కురిసిన వర్షాలతో భూగర్భ జలమట్టాల సగటు లోతు 10.07 మీటర్లకు తగ్గింది.
వర్షాకాలం ప్రారంభమైన తర్వాత జూన్‌లో కురిసిన వర్షాలతో భూగర్భ జలాల సగటు లోతు 9.47 మీటర్లకు ఎగబాకింది. మేతో పోల్చితే జూన్‌లో భూగర్భ జలమట్టాల సగటు 0.6 మీటర్ల మేర వృద్ధి చెందినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి ఈ మేరకు నివేదిక రూపొందించింది. అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షిస్తుంది.
12 జిల్లాల్లో ఆందోళనకరం
రాష్ట్రంలో భూగర్భ జలాలు అత్యల్పంగా జగిత్యాల జిల్లాలో 5.14 మీటర్ల లోతులోనే ఉండగా, అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 14.74 మీటర్ల లోతులో ఉన్నాయి. జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0–5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు.
అయితే, రాష్ట్రంలో ఒక్క జిల్లాలో కూడా ఈ పరిస్థితి లేదని గుర్తించారు. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 12 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోతే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. 12 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులున్నాయి.
20 శాతం తక్కువ వర్షపాతం
జూన్‌లో రాష్ట్రవార్షిక సగటు వర్షపాతం 130 మి.మీ. కాగా, 2025–26 జూన్‌లో 104 మి.మీ. నమోదైంది. అంటే సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షం కురిసింది. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో 22 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కాగా, మరో 11 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది జూన్‌లో సగటు భూగర్భ జలాల లోతు 9.9 మీటర్లుకాగా.. ఈ ఏడాది జూన్‌లో 9.47 మీటర్లుగా నమోదైంది.