ఆటోలో ఆరుగురు పిల్లలనే ఎక్కించాలి: హైకోర్టు కీలక ఆదేశాలు 

Important Orders Of High Court Regarding Schools And Students - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆటోలో ఆరుగురు విద్యార్థులకు మించి ఎక్కించరాదు.. విద్యార్థులను పాఠశాలలో వదిలేందుకు, తిరిగి తీసుకెళ్లేందుకు ఆవరణలో వాహనాల కోసం స్థలం ఉండాలి.. పాఠశాల జోన్‌ ప్రాంతాల్లో సిగ్నల్స్, జీబ్రా లైన్స్‌ ఏర్పాటు చేయాలి.. పిల్లలు రోడ్‌ దాటేటప్పుడు గార్డ్‌ విధిగా ఉండాలి.. లాంటి నిబంధనలన్నీ కఠినంగా అమలు చేయాలి’ అని హైకోర్టు.. అధికారులను ఆదేశించింది.

 పాఠశాలల వద్ద విద్యార్థులు రోడ్‌ దాటేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని.. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన హనుమంతరావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన నాలుగేళ్ల కూతురు రోడ్డు దాటుతుండగా ప్రమాదంలో మృతిచెందిందని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున కౌటూరు పవన్‌కుమార్‌ వాదనలు వినిపించారు. దీనిపై అధికారులు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. 

గోషామహల్‌ పోలీస్‌ స్టేడియంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ పరిధిలోని స్కూళ్ల యజమాన్యంతో సమావేశం నిర్వహించామని అఫిడవిట్‌లో చెప్పారు. ‘స్కూళ్లు ఉన్న చోట పలు ప్రాంతాల్లో వన్‌వే ట్రాఫిక్‌ రూల్‌ పెట్టాం. ఓవర్‌ స్పీడ్, ర్యాష్‌ డ్రైవింగ్‌ లాంటి నిరోధానికి చర్యలు తీసుకున్నాం. ట్రాఫిక్‌ రూల్స్‌పై విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని యజమాన్యాలకు చెప్పాం. సాధ్యమైన చోట ఫుట్‌ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు నిర్ణయించాం’ అని అందులో పేర్కొన్నారు. వీటిని కఠినంగా అమలు చేయాలన్న ధర్మాసనం.. పిటిషన్‌లో వాదనలు ముగించింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top