విదేశీ కొలువు.. బహు సులువు.. 140కి చేరిన రిక్రూటింగ్ ఏజెన్సీలు..

Immigration Jobs Easy Recruiting Agencies Increased Telangana - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): కరోనా కల్లోలం నుంచి తేరుకున్న తర్వాత భారత్‌ నుంచి విదేశాలకు వలసలు పెరిగాయి. ఇందుకు అనుగుణంగా లైసెన్స్‌డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. విదేశాంగ శాఖ వెబ్‌ పోర్టల్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం 2020కి ముందు తెలంగాణలో రిక్రూటింగ్‌ ఏజెన్సీల సంఖ్య 33 ఉండగా.. ఇప్పుడు 140కి చేరింది. ఇందులో 101 ప్రధాన కార్యాలయాలు కాగా మరో 39 వాటి శాఖలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 11 ఏజెన్సీలుండగా ఇప్పుడు 25 ప్రధాన కార్యాలయాలు, వాటికి అనుబంధంగా 30 శాఖలు ఏర్పాటయ్యాయి. లైసెన్స్‌డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీల సంఖ్య పెరగడం వల్ల విదేశాలకు చట్టబద్ధంగా వెళ్లడానికి అవకాశం కలుగుతుంది. నకిలీ ఏజెంట్ల వల్ల మోసపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.  

లైసెన్స్‌ల జారీలో సడలింపులతో.. 
గతంలో రిక్రూటింగ్‌ ఏజెన్సీ లైసెన్స్‌ పొందాలంటే రూ.50 లక్షల బ్యాంక్‌ గ్యారంటీని సమరి్పంచాల్సి వచ్చేది. ఇలా పొందిన లైసెన్స్‌తో ఇమ్మిగ్రేషన్‌ చట్టాలకు లోబడి వెయ్యి మందిని విదేశాలకు పంపించడానికి అవకాశం ఉండేది. లైసెన్స్‌ జారీ విధానంలో విదేశాంగ శాఖ సడలింపులు ఇవ్వడంతో రిక్రూటింగ్‌ ఏజెన్సీల విస్తరణకు అవకాశం ఏర్పడింది.

ఇప్పుడు లైసెన్స్‌ పొందాలంటే రూ.8 లక్షల బ్యాంకు గ్యారెంటీ సమర్పిస్తే సరిపోతుంది. వంద మందిని విదేశాలకు పంపించడానికి అవకాశం ఉంటుంది. విదేశాలకు పంపించే వారి సంఖ్యను పెంచుకోవాలంటే బ్యాంక్‌ గ్యారంటీని పెంచుకోవలసి ఉంటుంది.  

300కు మించి నకిలీ ఏజెంట్లు 
విదేశాంగ శాఖ లైసెన్స్‌డ్‌ రిక్రూటింగ్‌ ఏజెన్సీల వివరాలతో పాటు నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీల పేర్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఇందులో తెలుగు రాష్ట్రాలలో 300కు మించి నకిలీ ఏజెంట్లు ఉన్నారు. మోసపోయినవారి ఫిర్యాదుల ఆధారంగా నకిలీ ఏజెంట్ల వివరాలను ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో  తాము మోసపోయినట్లు కొంతమంది ఫిర్యాదు చేయగా.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించకుండానే విదేశాంగ శాఖ లైసెన్స్‌ పొందిన ఏజెన్సీలను  కూడా నకిలీ ఏజెంట్ల జాబితాలో కలిపేసి వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసినట్లు విమర్శలు  వస్తున్నాయి. 

లైసెన్స్‌డ్‌ ఏజెన్సీల ద్వారా గల్ఫ్‌ ఇతర దేశాలకు వెళ్లిన వారు ఒప్పందం ప్రకారం  పని, వేతనం ఉన్నా.. బద్ధకంతో ఇంటిదారి పట్టి తప్పుడు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అలాంటి వారు ఇచ్చిన ఫిర్యాదులలో వాస్తవాలను గుర్తించకపోవడంతో కొన్ని లైసెన్స్‌డ్‌ ఏజెన్సీలను నకిలీ 
ఏజెన్సీల జాబితాలో నమోదు చేయడం వల్ల విదేశాంగ శాఖకు చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇమిగ్రేషన్‌ చట్టాలను పక్కాగా అమలు చేస్తే నకిలీ ఏజెంట్లు, ఏజెన్సీల ఆటకట్టించడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: ‘వీహబ్‌’తోడుగా.. విజయం దిశగా..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top