బాసర ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాల తొలి జాబితా విడుదల

IIIT Basara 1st Selection List 2022 Released - Sakshi

99 శాతం గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే సీట్లు 

సిద్దిపేటకు అత్యధికంగా 212 సీట్లు.. హైదరాబాద్‌కు అత్యల్పంగా 7 సీట్లు

బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ శాస్త్ర, సాంకేతిక విశ్వవిద్యాలయ(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీలో 2022–23 విద్యాసంవత్సరం ప్రవేశాల తొలి జాబితాను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆరేళ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో 1,404 సీట్లకుగాను మెరిట్‌ జాబితాను ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌ వెంకటరమణ, డైరెక్టర్‌ సతీశ్‌కుమార్‌ విడుదల చేశారు.

జాబితాను వర్సిటీ అధికా రిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బాసర ఆర్జీయూకేటీలో తొలిజాబితాలో అత్యధికంగా సిద్దిపేట జిల్లాకు 212 సీట్లు దక్కగా, అత్యల్పంగా హైదరాబాద్‌ జిల్లాకు 07 సీట్లు మాత్రమే దక్కాయి. ఎంపికైనవారిలో 99 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులేనని అధికారులు తెలిపారు. గతేడాది కరోనా కారణంగా పాలిసెట్‌లో మెరిట్‌ ఆధారంగా సీట్లను భర్తీచేయడంతో 60 శాతం సీట్లు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులకే దక్కాయి. 

కానరాని ఆసిఫాబాద్, నారాయణపేట
తొలి జాబితాలో కుమురంభీం ఆసిఫాబాద్, నారాయణపేట జిల్లాలకు ఒక్క సీటూ దక్కలేదు. బాసర ట్రిపుల్‌ ఐటీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఆసిఫాబాద్‌ జిల్లాకు చోటు లభించకపోవడం గమనార్హం. పొరుగున ఉన్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు 258 సీట్లు దక్కగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు కేవలం 63 సీట్లు రావడం గమనార్హం.

మొదటిదశ కౌన్సెలింగ్‌ మూడురోజులపాటు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 28న 1 నుంచి 500 వరకు, 29న 501 నుంచి 1,000 వరకు, 30న 1001 నుంచి 1,404 ర్యాంకుల వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. మొదటిసారి ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 10 శాతం(140) సీట్లను కేటాయించినట్లు తెలిపారు. తొలి జాబితాలో73 శాతం బాలికలే ఉన్నట్లు ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top