అప్పట్లో .. చీతాలు వేటకుక్కల్లా.. | Sakshi
Sakshi News home page

అప్పట్లో .. చీతాలు వేటకుక్కల్లా..

Published Sun, Sep 18 2022 3:14 AM

IFS Officer Twitter Thread About How Cheetahs Went Extinct In India Goes Viral - Sakshi

మన దేశంలో 70 ఏళ్ల క్రితమే చీతాలు అంతరించిపోయాయి. వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తెచ్చి కునో నేషనల్‌ పార్క్‌లో వదిలింది. దీనితో దేశవ్యాప్తంగా ఈ చీతాలు ఏమిటి, వాటి బలం, వేగం ఏమిటన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది. కానీ అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒకప్పుడు మన దేశంలో చీతాలను పెంపుడు వేటకుక్కల్లా వినియోగించేవారు. ఇళ్ల వద్ద మేకలు, గొర్రెల్లా కట్టేసుకునేవారు. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ దీనికి సంబంధించి 1939 నాటి ‘వైల్డర్‌నెస్‌ ఫిల్మస్‌ ఇండియా లిమిటెడ్‌’ తీసిన వీడియోలు, ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.  

మిగతావి అంతరించక ముందే స్పందించాలి 
చీతాలను వేటకుక్కల్లా వాడుకోవడంతోపాటు.. అడవుల్లోని చీతాలను సరదాకు వేటాడేవారని ఐఎఫ్‌ఎస్‌ అధికారి పర్వీన్‌ కాస్వాన్‌ వివరించారు. పెంపుడు చీతాల సాయంతో ‘హంటింగ్‌ పార్టీ’లను నిర్వహించేవారని.. ఇలాంటివన్నీ కలిసి చీతాలు అంతరించిపోవడానికి కారణమైందని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని రకాల జంతువులు ఇలాంటి పరిస్థితి­లో ఉన్నాయని.. వాటి సంరక్షణపై దృష్టిపెట్టకుంటే చీతాల తరహాలో వాటిని కూడా ఫొటోల్లోనే చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. 

పెంపుడు కుక్కల్లా పెంచుకుని.. 
అప్పట్లో అడవుల్లోంచి చీతాలను పట్టుకుని వచ్చి పెంపుడు కుక్కల్లా పెంచుకునేవారు. వాటిని ఇంటి ముందు కట్టేసేవారు. జింకలు, దుప్పులను వేటాడటానికి చీతాలను వినియోగించేవారు. ఆ చీతాల కళ్లకు గంతలు కట్టి ఎడ్ల బండ్లపై జింకలు, దుప్పులు ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అక్కడ కళ్లగంతలు విప్పి వదిలేసేవారు. చీతాలు వేగంగా పరుగెత్తి జింకలు, దుప్పులను వేటాడేవి. అప్పుడు వాటి యజమానులు వెళ్లి.. ఆ జింకలు, దుప్పులను చంపి మాంసం తెచ్చుకునేవారు. ఈ సమయంలో ఆ జంతువుల రక్తాన్ని, కొంత మాంసాన్ని చీతాలకు పెట్టేవారు. ఈ దృశ్యాలన్నీ కూడా వైల్డర్‌నెస్‌ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. 

సాధారణంగా చీతాలు ప్రశాంతంగా ఉంటాయి. అనవసరంగా దాడి చేయవు. అందుకే మనుషులు వాటిని సులువుగా పెంచుకోగలిగారని నిపుణులు చెబుతున్నారు. 

బ్రిటన్‌కు చెందిన మరియన్‌ నార్త్‌ అనే బయాలజిస్ట్, ఆర్టిస్ట్‌ 1878లో విడుదల చేసిన పుస్తకంలోని ఒక పెయింటింగ్‌ను కూడా పర్వీన్‌ పోస్ట్‌ చేశారు. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో ఇళ్ల ముందు పెంపుడు కుక్కల్లా చీతాలను కట్టేసిన చిత్రం అది. 

1921–22 సమయంలో బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌ రాజస్థాన్‌లో జింకలను వేటడానికి పెంపుడు చీతాలతో వెళ్తున్నప్పటి ఫొటోను, 1947లో ఛత్తీస్‌గఢ్‌లో కింగ్‌ ఆఫ్‌ కొరియా మూడు చీతాలను వేటాడి చంపిన ఫొ­టో­ను పర్వీన్‌ షేర్‌ చేశారు. 

ఒక్క చీతాలు అనే కాదు.. పులులు, సింహాలు, చిరు­తç­³#­లులు, అడవి ఏనుగులు వంటి జంతువులను కూడా నాటి రాజులు, బ్రిటిషర్లు సరదా కోసం, గొప్పగా చూపుకోవడం కోసం వేటాడేవారు. 

952లో భారత ప్రభుత్వం మన దేశంలో ఆసియన్‌ చీతాలు అంతరించిపోయినట్టు అధికారికంగా ప్రకటించింది. 

అసలు మన దేశంలో తొలుత వన్యప్రాణి సంరక్షణ చట్టం లేదు. 1972లో తొలిసారిగా ‘వైల్డ్‌ లైఫ్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ పేరిట చట్టాన్ని తెచ్చారు. 

వేగం ఎక్కువ.. దూరం తక్కువ 
చీతాలు గంటలకు వంద కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. కేవలం మూడు సెకన్లలోనే అంత వేగాన్ని అందుకుంటాయి కూడా. కాకపోతే 30, 40 సెకన్లకు మించి ఆ వేగాన్ని కొనసాగించలేవు. అందుకే వేచి చూసి వేటకు దిగుతాయి. 30, 40 సెకన్లలో జంతువును చంపలేకపోతే వదిలేస్తాయి. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాయి. సీనియర్‌ జర్నలిస్టు సంజయ్‌ తాను రాసిన పుస్తకంలో చీతాలకు సంబంధించి ఇలాంటి కొన్ని ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

కేవలం సెకన్లలోనే సూపర్‌ స్పీడ్‌ అందుకునేలా, వేగంగా మలుపు తిరిగేలా చీతాల శరీర నిర్మాణం ఉంటుంది. చీతాల కళ్ల నుంచి నోటి వరకు ఉండే నల్లని చార సౌర కాంతి రిఫ్లెక్షన్‌ నుంచి కాపాడుతుందని.. దీనితో వాటి కళ్లు దూరంలో ఉన్న జంతువులను సైతం స్పష్టంగా చూడగలవని నిపుణులు చెబుతుంటారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. పులులు, సింహాలు, చిరుతల తరహాలో చీతాలు గర్జించవు. పిల్లుల్లా ధ్వనులు చేస్తాయి.

ఎప్పుడైనా ప్రమాదం అనిపించినప్పుడు మాత్రమే గుర్రుమని శబ్దం చేస్తాయి. చీతాల సగటు జీవితకాలం పన్నెండేళ్లు. జూలలో మాత్రం 20 ఏళ్ల వరకు బతికే అవకాశం ఉంది. అయితే చీతాల పిల్లల్లో మరణాల శాతం ఎక్కువ. పదింటిలో ఒకటే బతికి పెద్దది అవుతుంది. అందుకే వాటి జాతి వేగంగా పెరిగే అవకాశాలు తక్కువ.   

Advertisement
 
Advertisement
 
Advertisement