రాష్ట్రంలోహ్యుందాయ్‌ మెగా టెస్టింగ్‌ సెంటర్‌ | Hyundai Mega Testing Center in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోహ్యుందాయ్‌ మెగా టెస్టింగ్‌ సెంటర్‌

Aug 13 2024 4:24 AM | Updated on Aug 13 2024 11:26 AM

Hyundai Mega Testing Center in the state

హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్‌కేంద్రం ఆధునీకరణ, విస్తరణ 

దిగ్గజ కంపెనీల పెట్టుబడులపై దృష్టి: సీఎం 

టెక్స్‌టైల్‌ రంగానికి సంబంధించి శ్రీధర్‌బాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్‌ దిగ్గజ సంస్థ ‘హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ’తన భారతీయ అనుబంధ విభాగం ‘హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’(హెచ్‌ఎంఐఈ) ద్వారా తెలంగాణలో కార్ల ‘మెగా టెస్టింగ్‌ సెంటర్‌’ను స్థాపించనుంది. ఈ సెంటర్‌లో ఆటోమోటివ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సదుపాయంతో పాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం (ఎలక్ట్రిక్‌ వాహనాలతో సహా) కూడా ఉంటుంది. 

దీంతో పాటు హైదరాబాద్‌లోని తమ ఇంజనీరింగ్‌ కేంద్రం ఆధునీకరణ, విస్తరణ ద్వారా భారత్‌ సహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో హెచ్‌ఎంఐఈ మరింత ఉపాధి కల్పించనుంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం సియోల్‌లో హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. 

భారత్‌కు తమకు ముఖ్యమైన మార్కెట్‌ అని, వినియోగదారుల కోసం అత్యుత్తమ ఉత్పత్తులకు, సాంకేతిక అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు ఈ సందర్భంగా వెల్లడించారు. మెగా టెస్ట్‌ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు. 

పెట్టుబడులపై అగ్రశ్రేణి కంపెనీల ఆసక్తి: సీఎం 
‘ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్షించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి. ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థ, పగతిశీల విధానాలతో తెలంగాణలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల కోసం హెచ్‌ఎంఐఈ లాంటి అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయి..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 

పెట్టుబడులకు అనువుగా మెగా టెక్స్‌టైల్‌ పార్కు 
కొరియాలోని టెక్స్‌టైల్‌ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కు అనువైన ప్రదేశమని సీఎం అన్నారు. కొరియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ (కొఫోటి) ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 

వరంగల్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో యంగ్‌వన్‌ చైర్మన్‌ కిహక్‌ సంగ్, కొఫొటి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ సోయంగ్‌ జూతో పాటు 25 దిగ్గజ కొరియన్‌ టెక్స్‌టైల్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.  

చెంగ్చియాన్‌ నదిని సందర్శించిన రేవంత్‌ బృందం 
మూసీ నది పునరుద్ధరణ తర్వాత హైదరాబాద్‌ ఎలా ఉంటుంది?, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పునరుద్ధరణ ఎలా చేయాలి? వంటి అంశాలపై సీఎం రేవంత్‌ దృష్టి సారించారు. మూసీ పునరుద్ధరణకు అవసరమైన పరిష్కారాల అన్వేషణ, సాధ్యాసాధ్యాలపై అధ్యయనంలో భాగంగా సోమవారం అర్ధరాత్రి దక్షిణ కొరియా సియోల్‌ నగరంలోని చెంగ్చియాన్‌ నదిని ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. 

కాగా మూసీ విషయంలో అనేక ఆలోచనలు, ప్రణాళికలు తమ దృష్టికి వచ్చినట్లు సీఎం వెల్లడించారు. సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‌‘లో చెంగ్చియాన్‌ రివర్‌ ఫ్రంట్‌ వీడియోను ఆయన షేర్‌ చేశారు.       

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement