
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల రక్షణ, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నేడు హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అంబర్ పేట బతుకమ్మ కుంట వద్ద స్కూల్ స్టూడెంట్స్ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..‘చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో మేము చాలా అగ్రసీవ్ గా వెళ్ళాం. అలా చేయడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయి. భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం హైడ్రా పని చేస్తుంది. సీఎం ఆదేశాలతో సామజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. సెప్టెంబర్ 21న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. హైడ్రా అంటే డెమాలిషన్ కాదు డెవలప్‌మెంట్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మ కుంట ఒక షాంపిల్ మాత్రమే. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగు లోకి వస్తాయి.
గత ఏడాది జూలై 19న హైడ్రా ఏర్పడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టం. ప్రభుత్వ స్థలాలు కాపాడటంపై ప్రత్యేక దృష్టి సారించాం. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు.. దాదాపు 500 ఎకరాల భూమి కాపాడాం. వాటి విలువ 30వేల కోట్లకు పైనే ఉంటుంది. బతుకమ్మ కుంటను వెలుగులోకి తెచ్చాము. ప్రజల సహకారంతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కాపాడే ప్రయత్నం చేశాం. హైడ్రా అంటే కేవలం కూచివేతలు కాదు. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా పనిచేస్తుంది. పేద వారి మీద కాదు మా ప్రతాపం.. పెద్ద వారిపై కూడా హైడ్రా సమానంగా పని చేస్తుంది. హైడ్రాపై అనేక విమర్శలు చేశారు. సామాజిక కోణంలో హైడ్రా పని చేస్తుంది..
సల్కాం చెరువుపై ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. ఒవైసీ ఫాతిమా కాలేజీపై సామాజిక కోణంతో ముందుకు వెళ్తున్నాం. 140 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ ఉంది. మిగతా చెరువుల బౌండరీతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక మిగతా FTL, బఫర్‌లో వచ్చిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి చేతుల మీదగా బతుకమ్మ కుంట లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బతుకమ్మ కుంట పునరుద్దరణ చేయడం మా పనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు.