సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణ చైతన్య(32) తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతనికి చికిత్స కొనసాగుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు.
బుల్లెట్ దెబ్బకు తలకు బలమైన గాయం కావడంతో కృష్ణచైతన్యకు సర్జరీ చేశామని.. అయితే అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు బులిటెన్ ద్వారా వెల్లడించారు. చికిత్స కొనసాగుతోందని.. 48 గంటలు గడిస్తేగానీ పరిస్థితి ఏంటన్నది చెప్పలేమన్నారు.
హయత్‌నగర్‌లోని ఇంట్లో ఆదివారం కృష్ణచైతన్య తుపాకీతో పేల్చుకోవడంతో.. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. తొలుత వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ కారణం ఏంటన్నది స్వయంగా రంగనాథే మీడియాకు వెల్లడించారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆస్పత్రికి వెళ్లి కృష్ణచైతన్య కుటుంబ సభ్యులను రంగనాథ్ పరామర్శించారు. ‘‘దాదాపు రెండేళ్ల క్రితం బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌ల కారణంగా ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పుల కారణంగా అతడి జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోంది. కుటుంబ సమస్యల కారణంగా సుమారు 3 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు హయత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. అప్పటి నుంచి నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. విధుల్లో బాగానే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనకు సర్జరీ జరుగుతోంది. దయచేసి ఈ విషయాన్ని సంచలనం చేయొద్దు’’ అని మీడియాకు రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.


