Special Trains: స్పెషల్‌ లేదు ఏం లేదు.. సున్నాతో సున్నం! ఇదేం బాదుడు బాబోయ్‌..

Hyderabad: Special Rrains Are Not Canceled Even Covid Declining - Sakshi

రెగ్యులర్‌ రైళ్ల నంబర్లకే సున్నాను చేర్చిన రైల్వే 

కోవిడ్‌ తొలగినా రద్దుకాని ‘ప్రత్యేక’ రైళ్లు

ప్రత్యేకం పేరిట చార్జీల పెంపు కొనసాగింపు

పాత రైళ్లకే ‘ఎక్స్‌ప్రెస్‌’ ‘సూపర్‌ఫాస్ట్‌’ ముసుగులు

ఇదేం బాదుడు బాబోయ్‌ అంటున్న ప్రయాణికులు 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ కాలంలో అన్ని రైళ్లూ రద్దయ్యాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. అలా సొంత ఊళ్లకు చేరుకోకుండా ఎక్కడో ఒకచోట ఉండిపోయిన వాళ్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు దక్షిణమధ్య రైల్వే గతేడాది ‘ప్రత్యేక’ రైళ్లకు  శ్రీకారం చుట్టింది. అప్పటి వరకు నడిచిన రెగ్యులర్‌ రైళ్ల నంబర్లకు ‘సున్నా’ను జత చేసింది. దీంతో అవి అకస్మాత్తుగా  ‘ప్రత్యేక’ రైళ్ల అవతారమెత్తాయి. అలా ‘ఏమార్చి’న రైళ్లలో చార్జీలను పెంచారు.

కోవిడ్‌ కాలం తొలగిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నా ఆ ‘సున్నా’ మాత్రం అలాగే ఉండిపోయింది. బాదుడు రైళ్లు యథావిధిగా పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవడానికి బదులు ప్యాసింజర్లను ‘ఎక్స్‌ప్రెస్‌’లుగా, ఎక్స్‌ప్రెస్‌లను ‘సూపర్‌ఫాస్టు’లుగా నడుపుతున్నట్లు  అధికారులు ప్రకటించారు. కాని ఆయా రైళ్లలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవనీ, చార్జీలు మాత్రం దారుణంగా పెరిగాయని  ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

అవే రైళ్లు.. అదే వేగం... 
► రైళ్ల స్థాయిని పెంచినప్పటికీ  వేగంలో మాత్రం ఎలాంటి మార్పు  లేకపోవడం గమనార్హం. ప్యాసింజర్‌ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్‌ఫాస్టు రైళ్లు గంటకు 60 నుంచి 80 కిలోమీటర్లలోపే నడుస్తున్నాయి. కొన్ని రూట్లలో ఆ మాత్రం వేగం కూడా కష్టమే.  
► మరోవైపు ఒక్కో రూట్‌లో రెండు, మూడు స్టేషన్లలో హాల్టింగ్‌  సదుపాయం తొలగించడంతో కలిసొచి్చన సమయాన్ని వేగం పెంచినట్లుగా చూపుతున్నారని ప్రయాణికుల సంక్షేమ సంఘాలు  ఆందోళన  వ్యక్తం చేస్తున్నాయి.  

బాదుడు రైళ్లివే.. 
►  కోవిడ్‌ కంటే ముందు నడిచిన రైళ్లకు  ‘ప్రత్యేకం’గా నంబర్లకు  సున్నాను జత చేసి నడిపిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను సూపర్‌ఫాస్టులుగా, ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి బాదేస్తున్నారు. 
► భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17234/17233) కోవిడ్‌ తర్వాత (017234/017233)గా మారింది. అప్పటి వరకు ఉన్న ఎక్స్‌ప్రెస్‌ చార్జీలను సూపర్‌ఫాస్ట్‌ చార్జీలుగా మార్చారు. కరోనా కంటే ముందు సికింద్రాబాద్‌ నుంచి పెద్దపల్లి వరకు రూ.75 ఉన్న చార్జీని కోవిడ్‌ తర్వాత రూ.90కి పెంచారు. రిజర్వేషన్‌ సీట్‌ కావాలంటే అదనంగా మరో  రూ.15 చెల్లించాలి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ చేసుకొంటే మరో రూ.17 సర్‌చార్జీ చెల్లించాలి. మొత్తంగా  భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నంబర్‌కు  ‘0’ చేర్చడం వల్ల ఒక సీట్‌పై రూ.45 అదనపు భారం పడింది.  

► సికింద్రాబాద్‌ నుంచి మణుగూర్‌ వరకు నడిచే డైలీ ఎక్స్‌ప్రెస్‌ (17026/17025) ట్రైన్‌ను  కోవిడ్‌ నేపథ్యంలో  కేవలం నంబర్‌కు ముందు సున్నా చేర్చి చార్జీ రూ.15 పెంచారు. 
► సికింద్రాబాద్‌ నుంచి గద్వాల్‌ జంక్షన్‌ వరకు నడిచిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ చార్జీ కోవిడ్‌కు ముందు రూ.80  ఉంటే ఇప్పుడు రూ.95 కు పెంచారు. కేవలం నంబర్‌కు ముందు సున్నాను చేర్చడం వల్ల పెరిగిన చార్జీ ఇది. రైళ్ల వేగం ఏ మాత్రం పెరగడం లేదని,పైగా  కొన్ని స్టాపుల్లో  వాటిని నిలపకుండా నడపడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సివస్తోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  
► తాండూరు నుంచి సికింద్రాబాద్‌ వరకు నడిచిన మెము పుష్‌ఫుల్‌ రైల్లో  గతంలో తాండూరు నుంచి సికింద్రాబాద్‌ వరకు కేవలం రూ.35 చార్జీ ఉండేది. ఇప్పుడు ఆ రైలు నంబర్‌కు ‘సున్నా’ను జత చేయడంతో చార్జీ ఏకంగా రూ.70కి పెరిగింది.  
► కాచిగూడ నుంచి నిజామాబాద్‌ వరకు నడిచిన పుష్‌ఫుల్‌ ట్రైన్‌ చార్జీ రూ.45 నుంచి రూ.70 కి పెరిగింది. నంబర్‌కు ముందు ‘సున్నా’చేర్చి ‘ఎక్స్‌ప్రెస్‌’గా మార్చి చార్జీలను పెంచేశారు.  
► సికింద్రాబాద్‌ నుంచి కాగజ్‌నగర్‌కు రూ.95 ఉన్న చార్జీ ఇప్పుడు రూ.110 కి పెరిగింది.  
► నాగర్‌సోల్‌ నుంచి నర్సాపూర్‌ వరకు నడిచే ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో సికింద్రాబాద్‌ నుంచి కాజీపేట్‌ వరకు గతంలో రూ.60 మాత్రమే ఉండగా, ఇప్పుడు రూ.75 కు పెంచారు. 

దోచేస్తున్నారు.. 
ఏ రైలుకు ఎప్పుడు ‘సున్నా’ వచ్చి చేరుతుందో తెలియదు, కోవిడ్‌ నెపంతో  ‘ప్రత్యేక’ రైళ్లను నడిపి చార్జీలు పెంచారు. ప్రస్తుత సాధారణ పరిస్థితుల్లో పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాలి. కానీ అందుకు భిన్నంగా రెగ్యులర్‌ రైళ్లనే ‘ఎక్స్‌ప్రెస్‌’లుగా, ‘సూపర్‌ఫాస్ట్‌’లుగా నడుపుతున్నట్లు చెప్పి దోచుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం.
 – ఫణిరాజ్‌ శర్మన్‌ 

స్టేషన్లు వెలవెల.. 
గతంలో హాల్టింగ్‌ ఉన్న కొన్ని రైల్వేస్టేషన్లలో ఇప్పుడు హాల్టింగ్‌ తొలగించి వేగం పెంచినట్లుగా చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు ప్రయాణికులతో సందడిగా ఉన్న ఆ స్టేషన్లు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. ఇది ఏ విధమైన మార్పో అర్థం కావడం లేదు. 
– కామని శ్రీనివాస్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top