విద్యార్థిగా చేరి.. నాయకుడిగా వెళ్లండి

Hyderabad OU Vice Chancellor D Ravinder Comments On Osmania University - Sakshi

సంస్కరణల బాటలో ఓయూను ముందుకు తీసుకెళ్తున్నాం

హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా నైపుణ్య శిక్షణ

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ

సోషల్‌ సైన్సెస్‌లో పరిశోధనలకు పెద్దపీట

ఓయూ ఉప కులపతి డి.రవీందర్‌ వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: వినూత్న ఆలోచనలతో, ఆధునిక సంస్కరణలతో ఉస్మానియా యూనివర్సిటీ కీర్తిప్రతిష్టలను పెంచేందుకు కృషి చేస్తున్నామని ఓయూ ఉప కులపతి దండెబోయిన రవీందర్‌ అన్నారు. సంస్కరణలు, పనితీరు, రూపాంతరం అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు.

విశ్వవిద్యాలయ చరిత్రలో తొలిసారిగా క్లస్టర్‌ విధానాన్ని తీసుకొచ్చి నిజాం కాలేజీ, విశ్వవిద్యాలయ మహిళా కళాశాల సహా 9 కళాశాలలను ఎంపిక చేసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రవీందర్‌ శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ పురోగతిని ఆయన వివరించారు. ఆయన చెప్పిందేంటంటే... 

సివిల్‌ సర్వీస్‌ అకాడమీ..
♦హ్యూమన్‌ క్యాపిటల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. దీనివల్ల ఉద్యోగాల కల్పన తేలికవుతుంది. కంపెనీలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు తర్ఫీదునిచ్చే అవకాశం ఏర్పడింది. అంతర్జాతీయ విద్యా అవకాశాలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం సహా ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించేందుకు ఈ కేంద్రం పనిచేస్తోంది. 

♦పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సివిల్‌ సర్వీసెస్‌ అకాడమీ ఏర్పాటు చేశాం. విద్యార్థిగా ఓయూలో చేరి నాయకత్వ లక్షణాలతో బయటకు వెళ్లాలన్నదే ఈ అకాడమీ లక్ష్యం. విద్యార్థి సమన్వయ కేంద్రం, గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు సత్ఫలితాలనిస్తుంది. 

♦సెమినార్లు, సమావేశాలు, చర్చాగోష్టులు, ప్రదర్శనలు సహా ఇతర ప్రజాస్వామ్య పద్ధతిలో విద్యార్థులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టూడెంట్‌ డిస్కోర్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. క్యాంపస్‌లో రాజకీయ కార్యకలాపాలకు అవకాశం లేకుండా వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ ఇది అమలులో ఉంటుంది. 

విద్యార్థులకు యునీక్‌ ఐడీ.. 
♦సెంటినరీ హాస్టల్‌ విద్యార్థులకు యునీక్‌ ఐడెంటిటీ సంఖ్యను కేటాయించి ప్రతి ఒక్కరికీ వైఫై సౌకర్యం అందుబాటులోకి తెచ్చాం. సెంటినరీ హాస్టల్‌ బిల్డింగ్‌ చుట్టూ 120 సీసీ కెమెరాలు అమర్చి విద్యార్థుల రక్షణకు పెద్దపీట వేశాం. క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం కల్పించి శాంతిభద్రతలను కట్టుదిట్టం చేసే బాధ్యతను విశ్రాంత ఆర్మీ ఉద్యోగులకు అప్పగించాం. 

♦రూ. 11 కోట్లతో 300 మంది నిజాం కళాశాల విద్యార్థినుల కోసం నూతన హాస్టల్‌ భవనాన్ని నిర్మించాం. రూ.26 కోట్లతో 500 మంది బాలుర కోసం నిర్మించిన హాస్టల్‌ భవనాన్ని విద్యార్థినుల కోసం కేటాయించాం. మరిన్ని బాలికల నూతన హాస్టల్‌ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. విద్యార్థినులకు ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించాం. 

♦క్యాంపస్‌లోని ఓయూ సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లోనే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండో పసిఫిక్‌ స్టడీస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. సోషల్‌ సైన్సెస్‌లో పరిశోధనలకు ఊతమిచ్చేలా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రీసెర్చ్‌ సెంటర్, సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్‌ కేంద్రాలు నెలకొల్పాం. 

♦‘ఆరోగ్యం, సౌందర్య సాధనాలలో సహజ పదార్థాల వాడకం’ హైబ్రిడ్‌ మాస్టర్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించడానికి ఫ్రాన్స్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ బోర్డియాక్స్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నాం. వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆడిటివ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top