హైదరాబాద్‌లో కొత్త పోలీస్‌స్టేషన్లు వస్తున్నాయ్‌!

Hyderabad: New Police Stations List, Cyberabad Get Four, Balapur Police Division - Sakshi

నగర విస్తరణతో కొత్త పీఎస్‌ల ఏర్పాటు తప్పనిసరి

సైబరాబాద్‌లో జన్వాడ, మోకిల్ల, కొల్లూరు, గండిపేట ఠాణాలు

రాచకొండలో బాలాపూర్‌ డివిజన్‌తో పాటూ నాగోల్‌ స్టేషన్‌

అదనంగా 2–3 వేల సిబ్బంది నియామకం

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ శరవేగంగా విస్తరిస్తోంది. దశాబ్ద క్రితం వరకూ శివారు ప్రాంతాలు అనుకున్నవన్నీ నేడు ప్రధాన నగరంలో కలిసిపోయాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డును దాటేసి.. రీజినల్‌ రింగ్‌ రోడ్‌ వైపు పరుగులు పెడుతోంది. దీంతో అదే స్థాయిలో శాంతి భద్రతలను కల్పించేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కొత్త పోలీస్‌ సబ్‌ డివిజన్లు, పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్‌లో కొత్తగా నాలుగు ఠాణాలు, రాచకొండలో ఒక డివిజన్, పీఎస్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు అనేది జనాభా, నేరాల సంఖ్యను బట్టి ఉంటుంది. ఐటీ కంపెనీలతో పశ్చిమ హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందింది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, కోకాపేట, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ తదితర ప్రాంతాలు నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా  ప్రాంతాలలో శాంతి భద్రతలను పెంచాల్సిన అవసరం  ఉందని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 

సైబరాబాద్‌లో నాలుగు పీఎస్‌లు.. 
సెబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ 3,644 చ.కి.మీ. మేర విస్తరించి ఉంది. దేశంలో లక్ష జనాభాకు 138 మంది పోలీసులు ఉండగా.. సైబరాబాద్‌లో 86 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ మాదాపూర్, శంషాబాద్, బాలానగర్‌ మూడు జోన్లు, 9 డివిజన్లలో 36 లా అండ్‌ ఆర్డర్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. మాదాపూర్‌ డివిజన్‌లోని నార్సింగి, మియాపూర్‌ డివిజన్‌లోని ఆర్సీపురం, చేవెళ్ల డివిజన్‌లోని శంకర్‌పల్లి పీఎస్‌ల పరిధిని కుదించి.. ఆయా ప్రాంతాలతో పాటూ కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను కలిపి కొత్తగా సైబరాబాద్‌ కమిషనరేట్‌లో నాలుగు పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో నార్సింగి పీఎస్‌లోని గండిపేట, మెకిల్ల.. ఆర్సీపురం పీఎస్‌లోని కొల్లూరు, శంకర్‌పల్లి పీఎస్‌లోని జన్వాడ పేరిట కొత్త పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రధాన నగరంలోని పోలీస్‌ స్టేషన్లపై ఒత్తిడి తగ్గడంతో పాటూ నేరాల నియంత్రణ సులువవుతుందని తెలిపారు. 

2 నుంచి 3 వేల పోలీస్‌ సిబ్బంది కూడా.. 
శివారు ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న పోలీస్‌ స్టేషన్లతో పాటూ కొత్తగా రానున్న వాటిల్లో పోలీసుల నియామం చేపట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు సమాచారం. సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో అదనంగా 2–3 వేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌కు 9,403 మంది సిబ్బంది మంజూరు కాగా.. ప్రస్తుతం అన్ని ర్యాంక్‌లలో కలిపి 6,599 మంది సిబ్బంది ఉన్నారు. 2,804 పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. (ట్యాంక్‌బండ్‌పై అనునిత్యం రోడ్డు ప్రమాదాలు.. ఇలా ఎందుకు చేయరు?)

రాచకొండలో కొత్త డివిజన్, పీఎస్‌.. 
5,091.48 చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న రాచకొండ ఏరియా వారీగా దేశంలోనే అతిపెద్ద పోలీస్‌ కమిషనరేట్‌. రాచకొండలో అత్యధిక జనాభా ఉన్న ఎల్బీనగర్‌ జోన్‌ నుంచి కొన్ని ప్రాంతాలను విడదీసి కొత్త డివిజన్, పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో ఉన్న నాగోల్‌ను ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఎల్బీనగర్‌ జోన్‌లోని వనస్థలిపురం డివిజన్‌ను విభజించి ప్రత్యేకంగా బాలాపూర్‌ పోలీస్‌ డివిజన్‌ ఏర్పాటు కానుంది. వనస్థలిపురంలోని డివిజన్‌లోని కొన్ని ప్రాంతాలను, బాలాపూర్, పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌లతో పాటు, ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని పలు పోలీస్‌ స్టేషన్‌లను కలుపుకొని కొత్తగా బాలాపూర్‌ డివిజన్‌ ఏర్పాటు కానుంది.   (చదవండి: హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top