Year End 2021: గ్రేటర్‌లో హై.. ఫ్లై!

Year End 2021: Flyover Construction And Openings In Hyderabad - Sakshi

గ్రేటర్‌ రూపురేఖలు మార్చిన ఫ్లైఓవర్లు

ఎస్సార్‌డీపీతో అందుబాటులోకి.. 

దాదాపుగా రూ.2 వేల కోట్ల పనులు పూర్తి 

పురోగతిలోని పనులు రూ.6 వేల కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఎవరేమనుకున్నా.. ఎవరేం చెప్పినా గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చిన ఫ్లైఓవర్లు నగర రూపురేఖల్నే మార్చివేశాయి. ముఖ్యంగా ఎస్సార్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల పథకం) కింద చేపట్టిన పనులు ఎలాంటి నిధుల కొరత లేకుండా జరగడమే అందుకు కారణం. నిధుల లేమితో పనులు కుంటుపడవద్దనే తలంపుతో ప్రభుత్వం ఎస్సార్‌డీపీని ఏర్పాటుచేసి.. బాండ్లతో నిధులు సమకూరేలా చేయడమే కాక బ్యాంకు లోన్లకు అనుమతిచ్చింది. దీంతో జరిగే పనుల కనుగుణంగా బిల్లుల చెల్లింపులు జరుగుతుండటంతో పనులు వడివడిగా సాగుతున్నాయి.

దీనివల్ల జీహెచ్‌ఎంసీకి ఎంతో ఆర్థిక భారం పెరిగినా.. కళ్లముందరి ఫ్లై ఓవర్ల వల్ల ప్రజల ట్రాఫిక్‌ చిక్కులు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా నిర్మించారనే ఆరోపణలున్నా రోజురోజుకూ పెరుగుతున్న వాహన రద్దీతో మున్ముందు వాటి ఉపయోగం తెలుస్తుదంటున్న వారూ ఉన్నారు. దశల వారీగా చేపట్టిన పనుల్లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని రూ. 4500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇతర విభాగాలవి కూడా కలిపితే వాటి విలువ రూ.6 వేల కోట్లు. అన్ని విభాగాలవీ వెరసి దాదాపు రూ. 2 వేల కోట్ల పనులు పూర్తయ్యాయి.  


పురోగతిలో ఉన్నవి..  

బొటానికల్‌ గార్డెన్,కొత్తగూడ– కొండాపూర్‌ జంక్షన్‌ వద్ద: సెప్టెంబర్‌ 2022 
► శిల్పా లేఔట్‌ నుంచి గచ్చిబౌలి జంక్షన్‌ వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌తో సహ 120 అడుగుల వెడల్పుతో రోడ్డు: సెప్టెంబర్‌ 2022, ఫేజ్‌ 1 పూర్తవుతుందని అంచనా. 
► ఖైతలాపూర్‌ ఆర్‌ఓబీ(హైటెక్‌సిటీ– బోరబండ రైల్వేస్టేషన్ల మధ్య): కోర్టు వివాదం పరిష్కారమైతే మార్చి 2022లో పూర్తి. 

► ఎల్‌బీనగర్‌ కుడివైపు ఫ్లై ఓవర్‌: మార్చి 2022 
► బైరామల్‌ గూడ ఎడమవైపు ఫ్లై  ఓవర్‌: డిసెంబర్‌ 2022 
► బైరామల్‌గూడ కుడి, ఎడమ వైపులా రెండు లూప్‌లు, రెండో వరుసలో ఫ్లై ఓవర్‌: డిసెంబర్‌ 2022.  
నాగోల్‌ ఫ్లై ఓవర్‌ : జూన్‌ 2022 

► ఎల్‌బీనగర్‌ కుడివైపు అండర్‌పాస్‌: ఫిబ్రవరి 2022 
► పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జి: జనవరి 2022 
 తుకారాంగేట్‌ వద్ద ఆర్‌యూబీ: ఫిబ్రవరి 2022 

 ఇందిరాపార్కు–వీఎస్‌టీ, రామ్‌నగర్‌–బాగ్‌లింగంపల్లి ఫ్లై  ఓవర్లు: డిసెంబర్‌ 2022, 1వ ఫేజ్‌ 
 ఉప్పల్‌ జంక్షన్‌ ఫ్లై  ఓవర్‌: డిసెంబర్‌ 2023 
 బహదూర్‌పురా జంక్షన్‌ ఫ్లైఓవర్‌: మార్చి 2022 
► చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ పొడిగింపు: జూన్‌ 2022 

► నల్గొండ క్రాస్‌రోడ్స్‌– ఒవైసీ హాస్పిటల్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్‌: అక్టోబర్‌ 2022 
 ఫలక్‌నుమా ఫ్లైఓవర్‌కు సమాంతర ఫ్లైఓవర్‌: సెప్టెంబర్‌ 2022 
 శాస్త్రిపురం వద్ద ఆర్‌ఓబీ: జూలై 2023 
  ఆరాంఘర్‌నుంచి జూపార్క్‌ వరకు ఫ్లైఓవర్‌ మార్చి 2023లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. 
 ఇవి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని పనులు కాగా, గ్రేటర్‌ పరిధిలో ఇతర విభాగాల ఆధ్వర్యంలో పూర్తయిన, జరగుతున్న పనులిలా ఉన్నాయి. 
 

 పూర్తయిన పనులు: ఓఆర్‌ఆర్‌–మెదక్‌ సెక్షన్‌ వరకు రహదారుల విస్తరణ.. అప్‌గ్రేడేషన్‌ పనులు, బాలానగర్‌ క్రాస్‌రోడ్స్‌ ఫ్లైఓవర్, ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ. 
 

పూర్తి కావాల్సిన పనులు: అంబర్‌పేట  చేనెంబర్‌ క్రాస్‌రోడ్స్‌ ఫ్లైఓవర్‌(రూ.369.19 కోట్లు),ఆరాంఘర్‌– శంషాబాద్‌ సెక్షన్‌ ఫ్లైఓవర్‌(రూ.488 కోట్లు), ఉప్పల్‌– సీపీఆర్‌ఐ (రూ.821కోట్లు).  
► అన్ని విభాగాల్లో వెరసి పురోగతిలో ఉన్న  పనుల అంచనా వ్యయం దాదాపు రూ. 6 వేల కోట్లు.

పూర్తయిన పనులివీ.. ఫ్లైఓవర్లు 
మైండ్‌స్పేస్, రాజీవ్‌గాంధీ విగ్రహం(కూకట్‌పల్లి), బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద రెండు, రోడ్‌నెంబర్‌ 45–దుర్గంచెరువు కేబుల్‌బ్రిడ్జిని కలుపుతూ, కామినేని హాస్పిటల్‌ వద్ద రెండు వైపులా రెండు, ఎల్‌బీనగర్‌ వద్ద ఎడమవైపు, బైరామల్‌గూడ వద్ద కుడివైపు, పంజగుట్ట శ్మశానవాటిక వద్ద స్టీల్‌బ్రిడ్జితో, ఒవైసీ జంక్షన్‌లో అబ్దుల్‌ కలాం ఫ్లై ఓవర్‌ పూర్తయ్యాయి. ఇక షేక్‌పేటఫ్లై ఓవర్‌ నిర్మాణం కూడా పూర్తయింది. కొత్త సంవత్సర కానుకగా అందుబాటులోకి రానుంది.

► దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి నగరానికే తలమానికంగా నిలుస్తోంది. 

అండర్‌పాస్‌లు.. 
అయ్యప్పసొసైటీ జంక్షన్, మైండ్‌స్పేస్,చింతల్‌కుంట చెక్‌పోస్ట్‌ జంక్షన్,ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ వద్ద ఎడమవైపు. 

ఆర్‌యూబీ/ఆర్‌ఓబీలు.. 
హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్, ఉత్తమ్‌నగర్, ఉప్పుగూడల  వద్ద ఆర్‌యూబీలు, లాలాపేట ఆర్‌ఓబీ పునరుద్ధరణ. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top