Mahindra EV Plant: రూ. వెయ్యి కోట్లతో మహీంద్రా ఈవీ ప్లాంట్‌

Hyderabad: Mahindra To Set Up Ev Plant In Telangana, To Invest Rs 1000 Crore - Sakshi

1,000 మందికి పైగా  ఉపాధి అవకాశాలు

 3, 4 చక్రాల విద్యుత్‌ వాహనాల

తయారీ కేంద్రం ఏర్పాటుకు సంస్థ నిర్ణయం 

 జహీరాబాద్‌లోని ప్రస్తుత ప్లాంట్‌ విస్తరణ 

రాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ తెలంగాణలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న సంస్థ ప్లాంట్‌కు అనుబంధంగా ఈ నూతన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం మహీంద్రా అండ్‌ మహీంద్రా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. లాస్ట్‌మైల్‌ మొబిలిటీ వ్యాపారంలో భాగంగా 3, 4 చక్రాల విద్యుత్‌ వాహనాలను తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ‘తెలంగాణ మొబిలిటీ వ్యాలీ’ ప్రకటన తర్వాత జరిగిన చర్చల్లో భాగంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం జహీరాబాద్‌లో ఉన్న తయారీ ప్లాంట్‌ విస్తరణకు ఈ ఎంవోయూ ఉపకరించనుంది. సుమారు రూ. 1,000 కోట్లతో చేపట్టనున్న ఈ విస్తరణ ద్వారా 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వెహికల్, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టం తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.  

సస్టెయినబుల్‌ మొబిలిటీ రంగం అభివృద్ధికి కృషి: కేటీఆర్‌ 
దేశంలో సస్టైనబుల్‌ మొబిలిటీ రంగాన్ని మరింతగా వృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీ (టీఎంవీ) కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. టీఎంవీ లక్ష్యాలకు అనుగుణంగా మహీంద్రా అండ్‌ మహీంద్రాతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుందన్నారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నాలుగు మెగా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లలో జహీరాబాద్‌ ఒకటని తెలిపారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా అత్యున్నత ప్రమాణాలతో కూడిన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూపై మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ జేజురికర్‌ హర్షం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌లోని తయారీ ప్లాంట్‌ విస్తరణ ద్వారా త్రీ వీలర్‌ కేటగిరీలో మరిన్ని వాహనాలను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top