నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్‌ సదుపాయం

Hyderabad: Hostel Facility For Degree Students In Nizam College - Sakshi

బాలికల ఆందోళన నేపథ్యంలో స్పందించిన సర్కార్‌ 

200 మంది విద్యార్థినులకు వసతి 

అదనపు అంతస్తు నిర్మించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్న విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్‌/గన్‌ఫౌండ్రీ: నిజాం కాలేజీలో డిగ్రీ చదివే విద్యార్థినులకు కూడా హాస్టల్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన హాస్టల్‌ గదుల్లో సగం పీజీ చదివే విద్యార్థినులకు, మరో సగం డిగ్రీ చదివే విద్యార్థినులకు వసతి సదుపాయం అందుతుందని పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపారు. నిజాం కాలేజీలో ఇప్పటి వరకూ డిగ్రీ చదివే బాలురకు మాత్రమే హాస్టల్‌ సదుపాయం ఉంది. కాగా, తమకు కూడా హాస్టల్‌ సౌకర్యం కల్పించాలని నిజాం కాలేజీ విద్యార్థునులు ఇటీవల ఆందోళనకు దిగారు. ఈ విషయం మంత్రి కేటీఆర్‌ దృష్టికి రావడంతో, సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కేటీఆర్‌.. విద్యా శాఖ మంత్రి సబితను కోరారు.

ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఉన్నతాధికారులతో చర్చించారు. ఇందుకు అనుగుణంగా దాదాపు 200 మందికి హాస్టల్‌ సదుపాయం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల మెరిట్, వారి స్వస్థలానికి హైదరాబాద్‌కు ఉండే దూరాన్ని బట్టి సీట్లు కేటాయిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థినుల ఆందోళనపై ప్రభుత్వం మానవతా కోణంలో స్పందించి, తక్షణ పరిష్కారం చూపిందని మంత్రి సబిత ట్వీట్‌ చేశారు. అయితే డిగ్రీ విద్యార్థుల కోసం అదనంగా మరో అంతస్తు నిర్మాణంపై అధికారికంగా సర్క్యులర్‌ జారీ చేయాల్సిందిగా మంత్రిని కోరినట్లు విద్యార్థినులు పేర్కొన్నారు. అప్పటి వరకు తాము ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం చెట్టుకిందే పాఠాలు విని.. అక్కడే భోజనాలు చేశారు. శనివారం కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top