Corona patients: ఆక్సిజన్‌ అందక.. లైన్‌లో ఉండలేక..

Hyderabad: Hospital Staff Careless Behaviour Treatment Covid Patients- sakshi - Sakshi

ఆక్సిజన్‌ అందక.. లైన్‌లో ఉండలేక సొమ్మసిల్లిపోతున్న పేషెంట్లు 

సరైన సమాధానం చెప్పేవారు లేక అటెండెంట్స్‌ ఇబ్బంది 

ఐదారుగురికి కలిపి ఒకేసారి అడ్మిషన్‌ ఇస్తున్న సిబ్బంది 

చనిపోతే బాధ్యులెవరంటూ ఆవేదన చెందుతున్న అటెండెంట్స్‌  

సాక్షి, హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌): ‘సమయం మధ్యాహ్నం 12.50 గంటలు.. పాతబస్తీ నుంచి 26 ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులు కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్స్‌ 78 నుంచి 84 మధ్య ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఎమర్జెన్సీ అమ్మా.. తొందరగా అడ్మిట్‌ చేసుకోండంటూ కుటుంబ సభ్యులు అక్కడున్న సిబ్బందిని ప్రాధేయపడ్డారు.ఎవరైనా ఒకటేనమ్మా లైన్‌లో నిలబడండి, రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఆ స్లిప్‌ లెఫ్ట్‌లో ఉన్న క్యాబిన్‌లో ఇవ్వండనే సమాధానం వచ్చింది. అప్పటికే లైన్‌లో 15మందికి పైగా ఉన్నారు.

వారందర్నీ రిక్వెస్ట్‌ చేసిన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. స్లిప్‌ తీసుకుని ఎడమవైపు ఉన్న సమాచార క్యాబిన్‌లో ఉన్న నర్సులకు ఇచ్చారు. ఇక ఇక్కడ నిమిషాల కొద్దీ ఆలస్యం. సుమారు 45 నిమిషాల పాటు వెంట తెచ్చుకున్న ఆక్సిజన్‌ అయిపోతుంది, మహిళ తీవ్ర నిస్పృహకు గురవుతోంది. ఎంత వేడుకున్నా అస్సలు వినలేదు. 45 నిమిషాల తర్వాత ఒకేసారి ఐదుగురికి అడ్మిషన్‌ స్లిప్పులు ఇచ్చి 1.30గంటలకు పైకి పంపారు’.  ‘వజ్రమ్మ వయస్సు 92 ఏళ్లు. ఆక్సిజన్‌ సాచురేషన్‌ లెవెల్స్‌ 86 నుంచి 80కి పడిపోతున్నాయని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కుటుంబీకులు అడ్మిషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి అడ్మిషన్‌ స్లిప్‌ కోసం కనీసం 45 నిమిషాలకు పైగా వేచి చూశారు. ఓ పక్క వృద్ధురాలు వీల్‌చైర్‌లో అనేక అవస్థలు పడుతోంది. పెద్దామే బాధ చూడలేకపోతున్నాం.. త్వరగా అడ్మిట్‌ చేసుకోమని ప్రాధేయపడినా సరే.. అందరితో పాటే అడ్మిషన్‌ స్లిప్‌ని వృద్ధురాలికి కూడా ఇచ్చి పైకి పంపిన ఈ రెండు ఘటనలు బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకున్నాయి’.  
కంటతడి పెట్టిస్తున్న నిర్లక్ష్యం 
ఓ పక్క అయినవారు బతకాలనే ఆశ. మరో పక్క సిబ్బంది నిర్లక్ష్యం. ఈ రెండింటితో ఎవరిని ఏం అనాలో తెలియక పేషెంట్ల వెంబడి ఉన్న కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. సిబ్బందిపై కొద్దిగా కొప్పడితే బెడ్‌ ఇవ్వరేమో అనే భయం. కొద్దిగా ఓర్చుకో అమ్మా.. అంటూ పెషెంట్‌నిని ప్రాధేయపడుతున్న క్రమంలో.. ఆమె నిస్సాహాయకురాలిగా ఉంటుంది. కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్ల, నిత్యం వందలాది మందికి సర్వీస్‌ ఇవ్వడం వల్ల సిబ్బంది సైతం విసిగెత్తిపోతున్నారు. ప్రాణం పోతే ఆ బాధ, వేదన తమకే తెలుస్తోందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.   
15 నిమిషాల్లోనే అడ్మిట్‌
ఎవరినీ ఎక్కువ సేపు వెయిట్‌ చేయించేది లేదు. ఎమర్జెన్సీ ఉంటే పేషెంట్‌ని అడ్మిట్‌ చేసుకుని అడ్మిషన్‌ ప్రక్రియ వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. కానీ.. ఉద్ధేశపూర్వకంగా ఎవరినీ ఎక్కువ సేపు వేచి ఉంచేలా చేయము.
– డాక్టర్‌ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్‌  

( చదవండి: వెంటిలేటర్‌ బెడ్స్‌ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! )

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top