ఒక్క వానకే కకావికలం | Hyderabad: Heavy rains cause waterlogging and traffic jams | Sakshi
Sakshi News home page

ఒక్క వానకే కకావికలం

Apr 19 2025 6:02 AM | Updated on Apr 19 2025 9:02 AM

Hyderabad: Heavy rains cause waterlogging and traffic jams

తెల్లాపూర్‌లో విద్యుత్‌ తీగలపై బ్యానర్‌ పడి కరెంట్‌ పోవడంతో ఇలా ప్రమాదకరమైన రీతిలో క్రేన్‌కు వేలాడుతూ తొలగించేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌లో స్తంభించిన ట్రాఫిక్‌  

పలు జిల్లాల్లో పంట నష్టం.. తడిసిన ధాన్యం 

జనగామ జిల్లాలో పిడుగుపాటుతో 12 మందికి గాయాలు

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో శుక్రవారం పగలంతా మండిన ఎండలు.. సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈదురుగాలులకు తోడు భారీ వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. రాష్ట్ర ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం నగరంలోని కంచన్‌బాగ్‌లో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురాలో 7.9, చారి్మనార్‌లో 7.63 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి.

 హైదరాబాద్‌లోని పలుచోట్ల వరద నీరు భారీగా చేరడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా కురిసిన భారీ వర్షాలతో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సిద్దిపేట జిల్లాలో ఏకధాటి వర్షానికి దుబ్బాకలో 10 వేల క్వింటాళ్లకుపైగా ధాన్యం తడిసిపోయింది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో మామిడికాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ఉడకబెట్టి ఆరబెట్టిన పసుపుపంటలు తడిసి ముద్దయ్యాయి. 

ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగు 
జనగామ జిల్లా ఆలింపూర్‌లో వాన పడుతుండటంతో తలదాచుకునేందుకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వేసిన చలువ పందిరి కిందకు వెళ్లారు. వారికి సమీపంలోనే పిడుగు పడగా, ఆ ధాటికి వారంతా ఎగిరిపడ్డారు. 12 మందికి గాయాలయ్యాయి. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న కొందరికి వైద్యులు సీపీఆర్‌ చేశారు. కాగా, కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలో పిడుగు పడి 40 గొర్రెలు మృతిచెందాయి. రూ.5 లక్షలకుపైగా నష్టం వాటిల్లినట్టు బాధితుడు కడారి దేవయ్య తెలిపాడు. జనగామ జిల్లా చేర్యాలలో పిడుగుపాటుకు మూడు గేదెలు మృత్యువాత పడ్డాయి.

నేడు, రేపు అక్కడక్కడా వానలు
రాష్ట్రంలో రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని సూచించింది. శుక్రవారం నిజామాబాద్‌లో 42.6 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ట ఉష్ణోగ్రత, దుండిగల్‌లో 19.1 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement