సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు లేక ఎంఎంటీఎస్ రైళ్లు వెలవెలబోతున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత ఈ రైళ్లను పునరుద్ధరించి 45 రోజులు దాటినప్పటికీ ప్రయాణికుల ఆదరణ కనిపించడం లేదు. రోజుకు 30 వేల మంది కూడా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవడం లేదు. సాధారణ రోజుల్లో 1.6 లక్షల మంది రాకపోకలు సాగించగా ఇప్పుడు మూడొంతుల మంది ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కంటే అతి తక్కువ చార్జీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఎంఎంటీఎస్ సర్వీసులపైన పునరుద్ధరణ అనంతరం పెద్దగా ప్రచారం లేకపోవడం వల్ల ప్రయాణికుల వినియోగం పెరగడం లేదు.
మరోవైపు కోవిడ్ నేపథ్యంలో గతేడాది నుంచి ఐటీ రంగం పునరుద్ధరణకు నోచకపోవడం వల్ల వివిధ మార్గాల్లో ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి స్టేషన్‌ల మధ్య ప్రస్తుతం 45 నుంచి 50 ఎంఎంటీఎస్ సరీ్వసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో సగం వరకు ప్రయాణికులు లేక ఖాళీగా తిరుగుతున్నట్లు రైల్వే అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
16 నెలల తర్వాత పట్టాలపైకి.. 
కోవిడ్ నేపథ్యంలో గతేడాది మార్చి 22వ తేదీన నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే 121 ఎంఎంటీఎస్ రైళ్లు నిలిచిపోయాయి. దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో లోకల్ రైళ్లను చాలా రోజుల క్రితమే పునరుద్ధరించినప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ఈ ఏడాది జూన్ 22వ తేదీన పునరుద్ధరించారు. 2003లో ఈ రైళ్లను ప్రారంభించిన అనంతరం మొట్టమొదటిసారి కోవిడ్ కారణంగా స్తంభించాయి. సుమారు 16 నెలల పాటు ఎంఎంటీఎస్ సేవలు ఆగిపోవడంతో  నగరవాసులు దాదాపుగా ఈ రైళ్లను మరిచారు.
ఇదే సమయంలో సొంత వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఐటీ రంగం పునరుద్ధరించకపోవడం వల్ల సికింద్రాబాద్–హైటెక్‌సిటీ, లింగంపల్లి–హైటెక్‌సిటీ మార్గంలో డిమాండ్ పూర్తిగా తగ్గింది. ప్రభుత్వ,ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, చిరువ్యాపారులు, వివిధ వర్గాలు ఈ ఏడాదిన్నర కా లంలో చాలా వరకు సొంత వాహనాల వైపు మ ళ్లారు. దీంతో సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఆదరణ తగ్గినట్లుగానే ఎంఎంటీఎస్ రైళ్లకు సైతం తగ్గింది.
రద్దు దిశగా ఎంఎంటీఎస్ 
► గతంలో రోజుకు 121 సరీ్వసులు నడిచేవి. ప్రస్తుతం  45 నుంచి  50 సరీ్వసులు మాత్రమే నడుస్తున్నాయి. 
► ఈ  సరీ్వసులకు సైతం ఆదరణ లేకపోవడం వల్ల  సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి మధ్య నడిచే రైళ్లను తగ్గించారు. 
► ప్రతి ఆదివారం 10  రైళ్లను  రద్దు చేస్తున్నారు. గ త మూడు వారాలుగా ఈ రద్దు కొనసాగుతోంది.  
కొరవడిన ప్రచారం 
► దక్షిణమధ్య రైల్వేలో ప్రయాణికుల సదుపాయాలపైన ఎలాంటి పథకాలను  ప్రవేశపెట్టినా  విస్తృతంగా ప్రచారం చేస్తారు. వివిధ రూపాల్లో  ఈ  ప్రచారం కొనసాగుతుంది. 16 నెలల తరువాత పునరుద్ధరించిన ఎంఎంటీఎస్‌పైన ఆ స్థాయిలో ప్రచారం లేకపోవడం వల్లనే ప్రయాణికుల ఆదరణ లేదని  ప్రయాణికుల సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.  

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
