Hyderabad: హైదరాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కీలక ఆదేశాలు.. ‘ఇకపై వేసేయడమే’

Hyderabad CP CV Anand Bust 2 Fake Certificate Rackets - Sakshi

నేరాల్లో పాత్రధారులను ఉపేక్షించేదిలేదు

నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో తల్లిదండ్రుల పాత్ర

ఇప్పటికే ఖరీదు చేసిన విద్యార్థులను అరెస్టు చేశాం

త్వరలో వారి తల్లిదండ్రులను సైతం పట్టుకుంటాం

నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు కమిషనరేట్‌కు సంబంధించి ఎలాంటి నేరంలో ఎవరికి పాత్ర ఉన్నా ఉపేక్షించేది లేదని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌లు చేశాం. వాటితో ఫలితం ఉండట్లేదు. అందుకే ఇకపై వేసేయడమే (జైల్లో)’ అని వ్యాఖ్యానించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్న రెండు నకిలీసర్టిఫికెట్ల ముఠాల నుంచి వందల మంది ధ్రువపత్రాలు ఖరీదు చేశారు. ఈ వ్యవహారం వారి తల్లిదండ్రులకు తెలిసి జరగడంతో పాటు వారికీ పాత్ర ఉంది. ఇప్పటికే ఏడుగురి విద్యార్థులను అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారినీ పట్టుకుంటామని ఆనంద్‌ అన్నారు.

వీరికి సర్టిఫికెట్లు కొని పెట్టిన, ప్రోత్సహించిన తల్లిదండ్రులను సైతం అరెస్టు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన యూనివర్సిటీల గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేస్తూ యూజీసీకి ఆధారాలతో సహా లేఖ రాస్తాం. ఇటీవల డ్రగ్స్‌ కేసుల విషయంలోనూ తమ పంథా మార్చామని ఆయన అన్నారు. గతంలో మాదకద్రవ్యాల విక్రేతలను మాత్రమే అరెస్టు చేసే వాళ్లు. వీరి నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసి, వినియోగించిన వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చేవాళ్లు. పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విధానం మారింది.
చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు.. టీస్టాల్‌పై వీరంగం

టోనీ కేసులో ఏడుగురు బడా వ్యాపారులను కటకటాల్లోకి పంపారు. ఇకపైనా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోపక్క రాహుల్‌ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మహారాష్ట్రలో కేసు నమోదైనట్లు తెలిసిందని, ఒకే నేరంగా రెండు కేసులు సాధ్యం కావని అన్నారు. ఎక్కడ నమోదైందో తెలుసుకుని ఇక్కడి ఫిర్యాదులనూ అక్కడికే పంపుతామన్నారు. ఇప్పటి వరకు ఎక్కడా రిజిస్టర్‌ కాకపోతే మాత్రం జూబ్లీహిల్స్‌లో కేసు నమోదు చేస్తామని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వచ్చే ఫిర్యాదులు ఆ ఠాణాకే వస్తాయని పేర్కొన్నారు.
చదవండి: బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top