భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం | Hyderabad: Cm Kcr Pays Tribute To Lata Mangeshkar | Sakshi
Sakshi News home page

భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం

Feb 7 2022 3:15 AM | Updated on Feb 7 2022 7:37 AM

Hyderabad: Cm Kcr Pays Tribute To Lata Mangeshkar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన పాటతో భారతీయ సినీ సంగీత రంగంపై చెరగని ముద్ర వేశారన్నారు. ఆమె మృతి భారత సినీ, సంగీత రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దేశానికి లతా మంగేష్కర్‌ ద్వారా గంధర్వ గానం అందిందని, ఆమె భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం అని అన్నారు. లతాజీ మరణంతో పాట మూగబోయిందని, సంగీత మహల్‌ ఆగిపోయిందని విచారం వ్యక్తం చేశారు.

‘20 భాషల్లో 1,000 సినిమాల్లో 50 వేలకు పైగా పాటలు పాడిన లతాజీ.. సరస్వతీ స్వర నిధి. ఆమె పాటల మహల్‌. వెండితెర మీది నటి హావభావాలకు అనుగుణంగా ఆ నటియే స్వయంగా పాడుతుందా అన్నట్లు తన గాత్రాన్ని అందించిన లతాజీ గొప్ప నేపథ్యగాయని. పాటంటే లతాజీ .. లతాజీ అంటేనే పాట. సప్త స్వరాల తరంగ నాదాలతో శ్రోతలను తన్మయత్వంలో వోలలాడించిన లతా మంగేష్కర్, ఉత్తర దక్షిణాదికి సంగీత సరిగమల వారధి. కొందరికి పురస్కారాల వల్ల గౌరవం వస్తే, దేశ విదేశాల వ్యాప్తంగా ఆమెకు అందిన పురస్కారాలకు లతాజీ వల్ల గౌరవం దక్కింది. ఎందరో గాయకులు రావచ్చు కానీ లతాజీ లేని లోటు పూరించలేనిది’అని సీఎం స్మరించుకున్నారు. లతా మంగేష్కర్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

గవర్నర్‌ తమిళిసై దిగ్భ్రాంతి  
ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతి పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన దివ్యగాత్రంతో ఆమె శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశారని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె కొనియాడారు. లత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

సినీరంగానికి తీరని లోటు: కేటీఆర్‌ 
లతా మంగేష్కర్‌ మరణంపట్ల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించిన లతా మంగేష్కర్‌ మరణం తీరని లోటని ఆయన అన్నారు. కాగా, లతా మంగేష్కర్‌ మరణంపట్ల రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సత్యవతి రాథోడ్, వి. శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అర్వింద్‌ కుమార్‌ తదిత రులు సంతాపం వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్‌ మరణం దేశ సంగీత లోకానికి తీరని లోటని, సంగీత ప్రియుల గుండెల్లో ఆమె చిరస్థాయిలో నిలిచిపోతారని వేర్వేరు ప్రకటనల్లో వారంతా కొనియాడారు. లత మరణం దేశ ప్రజలందరినీ కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement