
భారతదేశ ప్రైవేట్ రాకెట్ రంగంలో చరిత్రాత్మక ఘట్టం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో మొదటిసారిగా అభివృద్ధి చేస్తున్న ప్రైవేట్ కక్ష్యనౌక విక్రమ్–1 తొలి ప్రయోగానికి ముందు కీలక మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ శుక్రవారం శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో, కలామ్–1200 పేరు గల మొదటి దశ కార్బన్ కాంపోజిట్ ఘన ఇంధన బూస్టర్‌ను స్థిర పరీక్ష (స్టాటిక్ టెస్ట్)లో విజయవంతంగా ప్రదర్శించింది. ఈ పరీక్షను ఇస్రో పర్యవేక్షణలో నిర్వహించారు. 11 మీటర్ల పొడవు కలిగిన కలామ్–1200, భారత అంతరిక్ష రంగంలో ఇప్పటివరకు ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన అతిపెద్ద ఏకరూప ఘన రాకెట్ మోటార్‌గా గుర్తింపు పొందింది. ఇది శూన్యావస్థలో సుమారు 1,200 కిలోన్యూటన్ గరిష్ట థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇది బోయింగ్ 737 మాక్స్ విమాన ఇంజిన్ శక్తి కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఈ మోటార్‌లో ప్రత్యేక ఘన ఇంధనాన్ని కార్బన్ కాంపోజిట్ కాస్టింగ్‌లో పోసి ఆకారం ఇవ్వడం (కాస్టింగ్) అనే సంక్లిష్ట ప్రక్రియను శ్రీహరికోట షార్‌లోని ఇస్రో నిపుణులు పూర్తి చేశారు. పరీక్షలో బూస్టర్ దశ బెలిస్టిక్ పనితీరు, దహన రేటు, థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్, రాకెట్‌కు దిశ మార్చే ఫ్లెక్స్ నాజిల్ సిస్టమ్‌ను సమగ్రంగా అంచనా వేశారు. సుమారు 110 సెకన్ల పాటు సాగిన ఈ పరీక్షలో మోటార్ అన్ని అంచనా పరిమితులలోనే అవసరమైన థ్రస్ట్‌ను అందించింది.
ప్రయోగ సమయంలో, కలామ్–1200 విక్రమ్–1ను 50 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, ఆపై అధునాతన వాయు–సంచాలిత వ్యవస్థ (ప్న్యూమాటిక్ సిస్టమ్) ద్వారా రెండవ దశ వేరు పడటం (స్టేజ్ సెపరేషన్) సాఫీగా జరుగుతుంది. యువ ఇంజినీర్ల కృషి, ఇస్రోలోని వసతులు, ఇన్‌స్పేస్ సహకారంతో ఈ విజయం సాధించినట్టు స్కైరూట్ సహ వ్యవస్థాపకులు పవన్‌కుమార్ చందన, నాగ భారత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగం నిర్మించిన అతిపెద్ద ఘన మోటార్ స్టాటిక్ టెస్ట్ విజయవంతం కావడం చరిత్రాత్మక ఘట్టమని ఇన్‌స్పేస్ చైర్మన్ డాక్టర్ పవన్‌గోయంకా అభినందించారు. విక్రమ్–1 ప్రయోగం ఈ ఏడాది చివర్లో జరగనుంది. ఇది చిన్న ఉపగ్రహాల కోసం తక్షణం, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రయోగ సేవలు అందించనుంది.