ప్రియురాలి మోజులో పడి పట్టించుకోవడం లేదు..

Husband Extra marital Affair With Girl Mystery In Warangal - Sakshi

సాక్షి, శాయంపేట(వరంగల్‌): ప్రియురాలి మోజులోపడి భర్త తనను పట్టించుకోవడం లేదని భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. కొప్పులకు చెందిన కొలిపాక మల్లికాంబ– బాపురావుల రెండో కూతురు హర్షితను అదే గ్రామానికి చెందిన సామల సరోజన– మధుసూదన్‌ దంపతుల పెద్ద కుమారుడు వేణుమాధవ్‌కు ఇచ్చి గత ఏడాది ఆగస్టు 5న వివాహం జరిపించారు. ఆ సమయంలో 10 తులాల బంగారం, రూ.15 లక్షల నగదు, 1.16 ఎకరాల భూమిని కట్నంగా ఇచ్చారు. అయితే, పెళ్లైన నాటి నుంచి భర్త తనతో కాపురం చేయడం లేదని హర్షిత ఆరోపించింది.

హన్మకొండలో సాత్విక చిట్‌ఫండ్‌ నడిపేవాడని, అందులో పనిచేసే ఓ యువతితో వివాహానికి ముందు నుంచే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు చెప్పింది. చిట్‌ఫండ్‌లో నష్టాలు రావడంతో అదనపు కట్నం కోసం భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, దీంతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. ఇదే విషయమై స్థానిక పెద్ద మనుషుల సమక్ష్యంలో ఐదుసార్లు పంచాయితీ సైతం జరిగిందని, అయినప్పటికీ విడాకుల నోటీసు పంపించినట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వివరించింది. అయినా ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం భర్త ఇంటి ఎదుట మౌన పోరాటానికి దిగింది. గ్రామానికి చెందిన పలువురు మహిళలు సైతం హర్షితకు అండగా నిలిచారు. విషయం తెలుసుకున్న పీఎస్సై సుమలత సిబ్బందితో చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి మౌన పోరాటాన్ని విరమింపజేశారు. అనంతరం ఆమె భర్తతోపాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top