
నిమ్స్‌లో కోలుకున్న 27 మంది
నలుగురికి ఇంకా కొనసాగుతున్న డయాలసిస్
నిమ్స్‌లో బాధితులను పరామర్శించిన మంత్రి దామోదర
కల్లులో నెఫ్రోటాక్సిక్స్ కలవటం వల్లే ప్రమాదం
బాధితుల రక్తంలో భారీగా సీరం క్రియాటినైన్: వైద్యులు
ఘటనపై నివేదిక కోరిన మానవ హక్కుల కమిషన్
సాక్షి, హైదరాబాద్/ లక్డీకాపూల్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 44కు పెరిగింది. కల్తీ కల్లు తాగి ఇప్పటికే ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్పను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మీడియాతో మాట్లాడుతూ.. నిమ్స్‌లో 31 మంది చికిత్స పొందుతున్నారని, వీరిలో 27 మంది కోలుకున్నట్లు తెలిపారు. వీరిని శుక్రవారం నుంచి దశలవారీగా డిశ్చార్జి చేస్తారని వెల్లడించారు.
నాలుగైదు రోజుల్లో అందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. నలుగురు బాధితులకు డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారని, మరో ఏడుగురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరినట్లు వివరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ డా.నిమ్మ సత్యనారాయణ, ఏఎంఎస్ డా.చరణ్‌రాజ్ తదితరులు ఉన్నారు.
నెఫ్రోటాక్సిక్స్ వల్లే..
కల్లులో నెఫ్రోటాక్సిక్స్ (కొన్ని ఔషధాలు, ఇతర కెమికల్స్ కలి సి కిడ్నీలపై చెడు ప్రభావం చూపటం) కలవటం వల్లనే అది తాగినవారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. బాధితుల రక్తంలో సీరం క్రియాటినైన్ భారీగా పెరగడంలో వారి కిడ్నీల పనితీరుపై ప్రభావం పడిందని నిమ్స్ వైద్యు లు వెల్లడించారు. సాధారణంగా కల్లులో మత్తు కోసం డైజోఫాం, క్లోరోహైడ్రేట్, తీపి కోసం శాక్రిన్, నురగ కోసం అమ్మోనియం లాంటివి కలుపుతుంటారు.
ఈ కల్లులో నెఫ్రోటాక్సిక్స్ కలవటం వల్లే ఎక్కువ మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు మరణించారు. కండరాలపై శ్రమ పెరిగినప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రియాటినైన్‌ను మూత్రపిండాలు రక్తం నుంచి శుద్ధి చేసి బయటకు పంపిస్తాయి. కానీ, ఈ క్రియాటి నైన్ అసాధారణంగా పెరిగిపోయినప్పుడు కిడ్నీలే దెబ్బతింటాయి. అప్పుడు ఈ వ్యర్ధ పదార్థం గుండె, మెదడుతోపాటు ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని నిమ్స్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చరణ్‌రాజ్ వివరించారు. అలాంటి సమయంలో వెంటనే డయాలసిస్ చేయకపోతే వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుందని తెలిపారు.
సమగ్ర నివేదిక ఇవ్వండి: మానవ హక్కుల కమిషన్
కల్తీ కల్లు సేవించి ఆరుగురు మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై 20వ తేదీలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించింది. న్యాయవాది ఇమ్మనేని రామరావుతోపాటు పలువురు ఫిర్యాదు చేయటంతో ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్, సభ్యులు శివాది ప్రవీణ, బి.కిషోర్‌లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టి పోలీసులకు పలు ఆదేశాలిచ్చింది.