పండక్కి కొత్త బండి కష్టమే!

Huge Waiting List For New Vehicles At Greater Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కష్టమే. నచ్చిన బండి కోసం మరి కొద్ది నెలల పాటు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాయాల్సిందే. గ్రేటర్‌లో కొత్త వాహనాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. కానీ అందుకు తగినవిధంగా వాహనాల లభ్యత లేకపోవడంతో వేలాది మంది కొనుగోలుదార్లు ఇప్పటికే తమకు కావలసిన కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఇప్పటికిప్పుడు కొత్త కారు కొనుగోలు చేయడం కష్టమేనని ఆటోమొబైల్‌ షోరూమ్‌ డీలర్లు చెబుతున్నారు.

సాధారణంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో మధ్యతరగతి వేతన జీవులు కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగానూ, ఒక సంప్రదాయంగాను భావిస్తారు. ఈసారి కూడా అలాగే  కొత్త వాహనాల కోసం ఆసక్తి చూపే వాళ్లకు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు బుక్‌ చేసుకున్నా కనీసం ఐదారు నెలల పాటు ఆగాల్సిందేనని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

గత రెండేళ్లుగా వ్యక్తిగత వాహనాలకు గణనీయమైన డిమాండ్‌ నెలకొన్నది. కోవిడ్‌ దృష్ట్యా చిరుద్యోగులు మొదలుకొని మధ్యతరగతి వర్గాల వరకు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. అందుకు తగిన విధంగా వాహనాలు మాత్రం దిగుమతి కావడం లేదు. దీంతో కొరత  ఏర్పడింది.  

ఆగాల్సిందే... 

  • గ్రేటర్‌ హైదరాబాద్‌లో సుమారు 150 ఆటోమొబైల్‌ షోరూమ్‌లలో  కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. రవాణాశాఖలో ప్రతి రోజు 1500 నుంచి  2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కొత్త వాహనాలకు డిమాండ్‌కు పెరగడంతో నమోదయ్యే వాహనాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.  
  • వ్యక్తిగత వాహనాల కేటగిరీలో అన్ని రకాల వాహనాలకు వెయిటింగ్‌ తప్పడం లేదు. హ్యూందాయ్, కియా, టయోటా, నెక్సాన్, మారుతి తదితర కంపెనీలకు చెందిన కార్ల కోసం 4 నుంచి 5 నెలల పాటు వెయిటింగ్‌ ఉంది. బాగా డిమాండ్‌ ఉన్న కొన్ని ప్రీమియం వాహనాలకు 6 నెలల వరకు కూడా డిమాండ్‌ నెలకొంది.  
  • ద్విచక్ర వాహనాలలో యూనికార్న్, హోండా యాక్టివా 125కి ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్లు ఆటోమొబైల్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహనాలకు  3 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది.  
  • ఈ ఏడాది చివరి వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చునని ఆటోమొబైల్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీపావళికి కూడా  డిమాండ్‌ భారీగానే ఉండే అవకాశం ఉంది.  

చిప్స్‌ కొరతే కారణం... 

  • వాహనాల తయారీలో కీలకమైన సాఫ్ట్‌వేర్‌ చిప్స్‌ దిగుమతి తగ్గడం వల్లనే ఈ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. మలేసియా, తైవాన్, చైనాల నుంచి మన దేశానికి వాహనాల చిప్స్‌ దిగుమతి అవుతాయి. రెండేళ్లుగా కోవిడ్‌ వల్ల చైనా నుంచి చిప్స్‌ దిగుమతి తగ్గిపోయింది. ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల డిమాండ్‌ పెరగడంతో మలేసియా, తైవాన్‌ల నుంచి సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో వాహనాల తయారీ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
  • ‘గత నెలతో పోలి్చతే ఈ నెలలో చిప్స్‌ కొరత కొంత వరకు తగ్గింది. దిగుమతి పెరిగింది. గతంలో 80 శాతం వరకు కొరత ఉండేది. ఇప్పుడు 40 శాతానికి తగ్గింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావచ్చు’. అని ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రామ్‌ తెలిపారు.    

(చదవండి: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top