New vehicle sales
-
కొత్త బండి కొంటున్నారా.. హ్యాండ్లింగ్ చార్జీలతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాల అమ్మకాలపై రకరకాల చార్జీలు, ఫీజుల రూపంలో వాహనదారులను నిలువునా దోచుకొనే వాహన షోరూమ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు తెలంగాణ రవాణాశాఖ సన్నద్ధమైంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాహనాల అమ్మకాలపైన హ్యాండ్లింగ్ చార్జీలు (handling charges), ఆర్టీఏ చార్జీల పేరిట రూ.5000 నుంచి రూ.10,000 వరకు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. గోడౌన్లలో ఉన్న వాహనాలను షోరూమ్ వరకు తరలించి వినియోగదారుడికి విక్రయించేందుకు హ్యాండ్లింగ్ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు.అలాగే వాహనాల రిజిస్ట్రేషన్లపైన సుమారు రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా వాహన వినియోగదారులపైన నిలువు దోపిడీకి పాల్పడే ఆటోమొబైల్ డీలర్లపైన కఠిన చర్యలను తీసుకోనున్నట్లు రవాణాశాఖ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ హెచ్చరించారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అథరైజేషన్‌ను సస్పెండ్ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే జీవిత కాలపు పన్ను (life time tax) చెల్లింపుల్లో, వాహనదారుడు రెండవ వాహనం కొనుగోలు చేసే సమయంలో విధించాల్సిన అదనపు జీవిత కాలపు పన్నుపైన కచ్చితమైన నిబంధనలు పాటించవలసిందేనన్నారు.పన్ను చెల్లింపుల్లో కొందరు డీలర్లు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వాహనదారులు తాము బండి కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి అదనపు చార్జీల వసూళ్లకు పాల్పడినా రవాణాశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. షోరూమ్‌లలో హ్యాండ్లింగ్ చార్జీల కోసం డిమాండ్ చేస్తే నేరుగా రవాణా కమిషనర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయవచ్చునన్నారు. అలాంటి డీలర్లను, షోరూమ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, సమగ్రమైన విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రశేఖర్‌గౌడ్ స్పష్టం చేశారు.మెడికల్ సీటు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన సంస్థపై కేసు బంజారాహిల్స్: ప్రఖ్యాత వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని నమ్మించి మోసగించిన సంస్థ యజమానితో పాటు ఇద్దరు ఉద్యోగులు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్‌పూర్ నగరానికి చెందిన సురేంద్రకుమార్ చంద్రాకర్ తన కుమారుడు ఆకర్ష్ చంద్రాకర్‌కు ఎంబీబీఎస్ సీటు కోసం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని సైబర్ హైట్స్‌లో ఉన్న శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్‌ను సంప్రదించాడు. ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగి రాకేష్ శైనీ మెడికల్ సీటు ఇప్పిస్తానంటూ సురేంద్రకుమార్‌ను నమ్మించి గత ఏడాది సెపె్టంబర్ 6వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నాడు.శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ అధినేత రాఘవేంద్రశర్మతో ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. చత్తీస్ఘడ్ బిలాయ్‌లో ఉన్న శంకరాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని ఈ సంస్థ అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్ శైనీ, గిరీష్ రూపానీలు నమ్మబలికి రూ.10,74,167 డీడీ కూడా తీసుకున్నారు. బిలాయ్‌లోని శంకరాచార్య మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా కూడా వెల్లడించారు. అయితే సురేంద్రకుమార్ కుమారుడు ఆకర్ష్‌కు నీట్ పరీక్షలో భాగంగా విశాఖపట్టణంలో మెడికల్ సీటు వచ్చింది. దీంతో తాను ఇచ్చిన రూ.10.74 లక్షల డీడీని తిరిగి ఇవ్వాలని సురేంద్రకుమార్ కోరారు. దీంతో ఈ సంస్థ అధినేతతో పాటు మిగతా ఉద్యోగులు స్పందించలేదు.చదవండి: 9999 @ రూ.9.37 లక్షలుతాను ఇచ్చిన డీడీని టోలిచౌకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) నుంచి డ్రా చేసుకున్నారని బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకరాచార్య మెడికల్ కాలేజీ పేరుతో డూప్లికేట్ అకౌంట్ తెరిచి తాను ఇచ్చిన డీడీని ఈ సంస్థ తన ఖాతాలో వేసుకుందని ఆరోపించారు. ఇదిలా ఉండగా శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ కార్యాలయం గత ఏడాది అక్టోబర్ 29 నుంచి మూతపడి ఉండగా, దీని అధినేత రాఘవేంద్రశర్మ పరారీలో ఉన్నాడు. ఈ విషయంలో బాధితుడు చత్తీస్‌ఘడ్‌లో కూడా వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్‌తో పాటు శ్రీబాలాజీ కెరీర్ గైడెన్స్ సంస్థ, దీని అధినేత రాఘవేంద్రశర్మ, ఉద్యోగులు రాకేష్శైనీ, గిరీష్ రూపానీలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పండక్కి కొత్త బండి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కష్టమే. నచ్చిన బండి కోసం మరి కొద్ది నెలల పాటు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాయాల్సిందే. గ్రేటర్లో కొత్త వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ అందుకు తగినవిధంగా వాహనాల లభ్యత లేకపోవడంతో వేలాది మంది కొనుగోలుదార్లు ఇప్పటికే తమకు కావలసిన కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఇప్పటికిప్పుడు కొత్త కారు కొనుగోలు చేయడం కష్టమేనని ఆటోమొబైల్ షోరూమ్ డీలర్లు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో మధ్యతరగతి వేతన జీవులు కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగానూ, ఒక సంప్రదాయంగాను భావిస్తారు. ఈసారి కూడా అలాగే కొత్త వాహనాల కోసం ఆసక్తి చూపే వాళ్లకు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నా కనీసం ఐదారు నెలల పాటు ఆగాల్సిందేనని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లుగా వ్యక్తిగత వాహనాలకు గణనీయమైన డిమాండ్ నెలకొన్నది. కోవిడ్ దృష్ట్యా చిరుద్యోగులు మొదలుకొని మధ్యతరగతి వర్గాల వరకు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకు తగిన విధంగా వాహనాలు మాత్రం దిగుమతి కావడం లేదు. దీంతో కొరత ఏర్పడింది. ఆగాల్సిందే... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. రవాణాశాఖలో ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కొత్త వాహనాలకు డిమాండ్‌కు పెరగడంతో నమోదయ్యే వాహనాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల కేటగిరీలో అన్ని రకాల వాహనాలకు వెయిటింగ్ తప్పడం లేదు. హ్యూందాయ్, కియా, టయోటా, నెక్సాన్, మారుతి తదితర కంపెనీలకు చెందిన కార్ల కోసం 4 నుంచి 5 నెలల పాటు వెయిటింగ్ ఉంది. బాగా డిమాండ్ ఉన్న కొన్ని ప్రీమియం వాహనాలకు 6 నెలల వరకు కూడా డిమాండ్ నెలకొంది. ద్విచక్ర వాహనాలలో యూనికార్న్, హోండా యాక్టివా 125కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహనాలకు 3 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చునని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీపావళికి కూడా డిమాండ్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చిప్స్ కొరతే కారణం... వాహనాల తయారీలో కీలకమైన సాఫ్ట్వేర్ చిప్స్ దిగుమతి తగ్గడం వల్లనే ఈ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. మలేసియా, తైవాన్, చైనాల నుంచి మన దేశానికి వాహనాల చిప్స్ దిగుమతి అవుతాయి. రెండేళ్లుగా కోవిడ్ వల్ల చైనా నుంచి చిప్స్ దిగుమతి తగ్గిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల డిమాండ్ పెరగడంతో మలేసియా, తైవాన్‌ల నుంచి సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో వాహనాల తయారీ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘గత నెలతో పోలి్చతే ఈ నెలలో చిప్స్ కొరత కొంత వరకు తగ్గింది. దిగుమతి పెరిగింది. గతంలో 80 శాతం వరకు కొరత ఉండేది. ఇప్పుడు 40 శాతానికి తగ్గింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావచ్చు’. అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ తెలిపారు. (చదవండి: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి) -
హ్యాండ్లింగ్ దోపిడీ
ఆటో మొబైల్ షోరూంల మాయాజాలం ఇన్వాయిస్లో చూపకుండా వాహనానికి రూ.5 వేల బాదుడు ఏటా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు పలు షోరూమ్‌లపై సస్పెన్షన్ విధించిన ఆర్టీఏ సిటీబ్యూరో : నగరంలో రోజుకు కనీసం 600 కొత్త వాహనాల అమ్మకాలు.... ప్రతి వాహనంపైన ‘హ్యాండ్లింగ్ చార్జీల’ పేరిట రోజుకు రూ. 30 లక్షల వసూళ్లు మొత్తంగా ఏటా కొనుగోలుదారుల నుంచి రూ.90 కోట్ల వరకు లూటీ కొత్త వాహనం కోసం షోరూమ్‌లకు వెళ్లే వినియోగదారులపై ఆటోమోబైల్ డీలర్లు హ్యాండ్లింగ్ చార్జీల పేరిట కొనసాగిస్తున్న అక్రమ వసూళ్లపర్వం ఇది. వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్లు, గోడౌన్ నుంచి వాహనాన్ని షోరూమ్ వరకు తరలించినందుకు (దీన్ని ప్రాసెసింగ్ అంటారు.)అయిన ఖర్చుతో పాటు అన్నీ కలిపి ఒక్కో వాహనదారుడి నుంచి ‘హ్యాండ్లింగ్ చార్జీల’ రూపంలో సగటున రూ.5000 చొప్పున వసూలు చేస్తున్నారు. కొత్తవాహనం కోసం షోరూమ్‌కు వెళ్లిన వినియోగదారుడి సంతోషాన్ని ఆవిరి చేస్తూ షోరూమ్ నిర్వాహకులు వారి జేబులు లూటీ చేస్తున్నారు. నగరంలోని సుమారు175 షోరూమ్‌లుండగా...మెజారిటీ షోరూమ్‌లలో ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో మోసానికి పాల్పడుతున్న పలు షోరూమ్‌లపై రవాణాశాఖ చర్యలు చేపట్టింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై వాటికి ఉన్న అధికారాన్ని సస్పెండ్ చేసింది. దోపిడీ పర్వం ఇలా.... సికింద్రాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కొద్ది రోజుల క్రితం బజాజ్ పల్సర్ వాహనం కోసం ఒక షోరూమ్‌కు వెళ్లాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు. కానీ హ్యాండ్లింగ్ చార్జీలు, ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు వసూలు చేశారు. కానీ ఇన్వాయిస్లో మాత్రం హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం ఎక్కడా కనిపించదు. రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. నగరంలో ప్రతిరోజు కొత్తగా నమోదవుతున్న 600 వాహనాలలో 400 ద్విచక్ర వాహనాలు ఉంటే. మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట బుకింగ్ కోసం వెళ్లినప్పుడు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. ఆ తరువాత కొనుగోలు సమయంలో ఠంచన్‌గా హ్యాండ్లింగ్ చార్జీలు తెర మీదకు వస్తాయి. అప్పటికే వాహనం కొనుక్కోవడానికి సిద్ధపడిన వినియోగదారుడు అనివార్యంగా అడిగినంతా చెల్లించవలసి వస్తుంది. ఉపాధి కోసం ఆటోరిక్షాలు కొనుగోలు చేసే సాధారణ డ్రైవర్లను సైతం షోరూమ్‌లు నిలువునా దోచుకుంటున్నాయి. ఇలా వాహనాల నుంచి రూ.5000 చొప్పున ప్రతి రోజు 600 వాహనాల పై వసూలు చేస్తున్న హ్యాండ్లింగ్ చార్జీలు రూ.30 లక్షలకు చేరుతున్నాయి.నెలకు రూ.7.5 కోట్లు, సంవత్సరానికి రూ.90 కోట్ల వరకు షోరూమ్‌ల ఖాతాలో చేరిపోతున్నాయి. తాత్కాలిక సస్పెన్షన్ ... ఇలా మోసానికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన 3 షోరూమ్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ వెల్లడించారు. వాటికి ఉన్న తాత్కాలిక రిజిస్ట్రేషన్ అధికారాన్ని సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయండి ఇన్వాయిస్లో నమోదైన ధర కంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా, తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల పేరిట, ఆర్టీఏకు చెల్లించాలనే నెపంతో ఎలాంటి అదనపు వసూళ్లకు పాల్పడినా మా అధికారులకు ఫిర్యాదు చేయండి. ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ సంయుక్త రవాణా అధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించండి. లేదా ప్రాంతీయ రవాణా అధికారుల దృష్టికి తీసుకెళ్లండి. - రఘునాథ్, జేటీసీ