‘యాదాద్రి’లో భక్తుల రద్దీ.. | Huge Crowd Of Devotees In Yadagirigutta Temple In Nalgonda | Sakshi
Sakshi News home page

‘యాదాద్రి’లో ‘స్వాతి నక్షత్ర’ పూజలు

Sep 21 2020 12:09 PM | Updated on Sep 21 2020 12:09 PM

Huge Crowd Of Devotees In Yadagirigutta Temple In Nalgonda - Sakshi

బాల ఆలయంలో బారులుదీరిన భక్తులు  

సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాల ఆలయంలో స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆదివారం విశేషంగా పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు నిత్యారాధనలతో పాటు వేకువ జామున అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం అర్చకస్వాములు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ మహా మండపంలో 108 కలశాలలకు శాస్త్రోక్తంగా శతఘటాభిషేక పూజ చేసి, అందులోని వివిధ ఫల రసములు, పంచామృతాలు, ఫల జలములు, శుద్ధమైన జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ శతఘటాభిషేకంలో ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, వేదపండితులు, ఆలయ అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు. అదే విధంగా నిత్య పూజలు కూడా ఘనంగా నిర్వహించారు.

కలశాన్ని ఊరేగిస్తున్న ఆచార్యులు, ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి
శ్రీస్వామి వారి ఆదాయం రూ.6,56,449 
భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకోవడంతో ఆలయానికి రూ.6,56,449 ఆదాయం చేకూరిందని అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ.1,000, ప్రచార శాఖ ద్వారా రూ.4,150, ప్రసాద విక్రయం ద్వారా రూ.5,31,845, శాశ్వత పూజల ద్వారా రూ.35,848, చెక్‌పోస్టు ద్వారా రూ.2,170, మినీ బస్సు ద్వారా రూ.2,510, వాహన పూజల ద్వారా రూ.17,200, అన్నధాన విరాళం ద్వారా రూ.6,616, కొబ్బరికాయల ద్వారా రూ.54,570 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

పూజలు చేస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు
స్వామివారిని దర్శించుకున్న ఎర్రోళ్ల శ్రీనివాస్‌
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆదివారం సందర్శించారు. బాల ఆలయంలో ప్రతిష్ఠామూర్తులను దర్శించుకున్న ఆయనకు ఆలయ అచార్యులు స్వామి అమ్మవార్ల ఆశీస్సులను అందజేశారు. అనంతరం ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు.  తదనంతరం యాదగిరిగుట్ట మున్సిపాలిటి కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌  శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించారు.

నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. ఆదివారంస్వామి వారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో బాల ఆలయం, ప్రసాదం కౌంటర్, ఆలయ పరిసరాలు, పుష్కరిణి వద్ద, ఘాట్‌ రోడ్లలోని పార్క్‌లు భక్తులతో కోలాహలంగా కనిపించాయి. స్వామి వారిని సుమారు 5,500 నుంచి 6వేల వరకు భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

గర్భాలయ గోడకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలు
అద్భుత శిల్పాలు.. ఆధ్యాత్మిక రూపాలు
యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయమంతా ఆధ్యాత్మిక రూపాలను శిల్పులు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన ఆలయంలో నారసింహ రూపాలు, దశవతారాలు, సుదర్శన ఆళ్వార్, శంకు, చక్ర, నామాలు, వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ఆధ్యాత్మిక రూపాలను శిల్పులు చెక్కి, వాటిని తుది మెరుగులు దిద్దారు. ప్రధాన ఆలయంలో భక్తులకు పునర్‌ దర్శనం ప్రారంభం కాగానే వారిని ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్లే విధంగా ఈ రూపాలను తీర్చిదిద్దుతున్నారు. ఇటీవల యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ ఈ ఆధ్యాత్మిక రూపాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

కృష్ణశిల రాతి గోడపై తీర్చిదిద్దిన సుదర్శన ఆళ్వార్‌ రూపం​​​​​​​

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement