మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో హెచ్‌ఆర్‌డీఏ ఘన విజయం | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో హెచ్‌ఆర్‌డీఏ ఘన విజయం

Published Sat, Dec 23 2023 4:59 AM

HRDA won the medical council elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎంసీ) ఎన్నికల్లో హెల్త్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) ఘన విజయం సాధించింది. హెచ్‌ఆర్‌డీఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మహేశ్‌కుమార్‌ నేతృత్వంలోని డాక్టర్ల టీమ్‌ ఎన్నికలు జరిగిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది. హేమాహేమీలుగా పిలిచే ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు ఓడిపోయారు. కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉన్న ప్రతి డాక్టర్‌ 13 ఓట్లు వేయాల్సి ఉంటుంది.

ఈ 13 ఓట్లను కలిపి ఒక్క ఓటుగా పరిగణిస్తారు. అలా ఈ ఎన్నికల్లో మొత్తం 17,090 ఓట్లు పోల్‌ కాగా, రకరకాల కారణాలతో 3,311 ఓట్లను రిటర్ణింగ్‌ ఆఫీసర్‌ తిరస్కరించారు. మిగిలిన 13,779 ఓట్లను లెక్కించారు. అత్యధికంగా డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి 7,007 ఓట్లను సాధించగా, డాక్టర్‌ మహేశ్‌కుమార్‌ 6,735 ఓట్లు సాధించారు.  

రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా ఎన్నికలు... 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరిగాయి. మెడికల్‌ కౌన్సిల్‌ 25 మంది డాక్టర్లతో ఏర్పాటవుతుంది. అందులో 13 మంది ఇప్పుడు డాక్టర్లు ఓటు ద్వారా ఎన్నికయ్యారు. మిగిలిన 12 మందిని ప్రభుత్వం నామినేట్‌ చేయాల్సి ఉంది. అనంతరం చైర్మన్‌ను ఎన్నుకుంటారు. చైర్మన్‌ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది.

ఈ పదవినీ హెచ్‌ఆర్‌డీఏ కైవసం చేసుకునే అవకాశం ఉంది. వాస్తవంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు తెరలేచింది. అసెంబ్లీ ఎన్నికల వల్ల మెడికల్‌ కౌన్సిల్‌ ఎన్నికలపై ఎవరూ పెద్దగా ఫోకస్‌ చేయలేదు. తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వాళ్లు రిజి్రస్టేషన్‌ చేసుకుంటారు. ఈ ఎన్నికల్లో వారే ఓట్లేశారు.  

విజేతలు సాధించిన ఓట్లు ఇలా 
డాక్టర్‌ ప్రతిభా లక్ష్మి 7,007 ఓట్లు, డాక్టర్‌ కె.మహేష్కుమార్‌ 6,735, డాక్టర్‌ బండారి రాజ్‌కుమార్‌ 6,593, డాక్టర్‌ జి.శ్రీనివాస్‌ 6,454, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ 6,434, డాక్టర్‌ ఎస్‌.ఆనంద్‌    6,192, యెగ్గన శ్రీనివాస్‌    6,086, డాక్టర్‌ రవికుమా­ర్‌ 6,085, డాక్టర్‌ నరేష్‌కుమార్‌ 6,091, డాక్టర్‌ శ్రీకాంత్‌ 5,974, డాక్టర్‌ సన్నీ దావిస్‌ 5,912, డాక్టర్‌ విష్ణు 5,844, డాక్టర్‌ సయ్యద్‌ ఖాజా ఇమ్రాన్‌ అలీ 5695 ఓట్లు సాధించారు.

Advertisement
 
Advertisement