
రెండు వేల ఎకరాలకు కొరవడిన భద్రత
ఆ విభాగాల మధ్య సమన్వయలేమి
అమలుకు నోచుకోని జియో ఫెన్సింగ్
కబ్జాదారుల చెరలో విలువైన స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భూములకు రక్షణ కొరవడింది. వివిధ జిల్లాల్లో హెచ్‌ఎండీఏకు చెందిన భూములు వందల ఎకరాల్లో ఉన్నాయి. కానీ అనేక చోట్ల అన్యాక్రాంతమవుతున్నాయి. కబ్జాదారులు భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మియాపూర్, జవహర్‌నగర్, శంషాబాద్ (Shamshabad) తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున హెచ్‌ఎండీఏ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయి. చివరకు పోలీసులు, రెవిన్యూ తదితర విభాగాలకు చెందిన యంత్రాంగాలు రంగంలోకి దిగి కొన్ని చోట్ల భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ దశాబ్ద కాలంగా పెద్ద సంఖ్యలోనే భూములను కోల్పోయినట్లు సమాచారం.
భద్రత ఏర్పాటు చేయకపోవడంతో..
మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్లలోని సుమారు 500 ఎకరాల భూములను కాపాడుకొనేందుకు గత ఏడాది పోలీసులు కబ్జాదారుల నుంచి హెచ్‌ఎండీఏకు అప్పగించారు.
శంషాబాద్‌లోనూ హెచ్‌ఎండీఏకు ఉన్న సుమారు 200 ఎకరాల భూముల్లో 50 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిలో ఏకంగా కొన్ని భవనాలను కూడా కట్టించారు. వీటి రక్షణ కోసం హెచ్‌ఎండీఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుతో భూమిని తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్మించిన భవనాలను సైతం తొలగించారు. ఇలా ఎక్కడో ఒక చోట కబ్జాకు గురైనట్లు హెచ్‌ఎండీఏ దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే అధికారులు జోక్యం చేసుకొని రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి భద్రత ఏర్పాటు చేయకపోవడంతో హెచ్‌ఎండీఏ పరిధిలోని వివిధ జిల్లాల్లో సుమారు 2,000 ఎకరాల భూములకు రక్షణ లేకుండాపోయింది. కొన్ని చోట్ల సరైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.
కాగితాల్లోనే ప్రతిపాదనలు..
మరోవైపు భూములను కాపాడేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా సమస్యగా మారింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎస్టేట్ విభాగాల మధ్య కొంతకాలంగా సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జవహర్‌నగర్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆక్రమణకు గురి కాగా.. మరో 1,300 ఎకరాల భూములు హెచ్‌ఎండీఏ ఖాతాలోఉన్నాయి. ‘హెచ్‌ఎండీఏకు చెందిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనే సంగతి తెలియదు. పై అధికారుల సూచనల మేరకు సెక్యూరిటీ ఏర్పాటు చేయడం వరకే పరిమితమయ్యాం’అని హెచ్‌ఎండీఏ విజిలెన్స్ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు.
కబ్జా కోరల్లో చిక్కుకున్న మియాపూర్ (Miyapur) భూములను కాపాడేందుకు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తరహాలో మిగిలిన చోట్ల కూడా ఇలాగే చర్యలు తీసుకోవాలనే ప్రతిపాదన ఉన్నా.. అమలుకు మాత్రం నోచుకోవడంలేదు. ఎస్టేట్ విభాగం నిర్లక్ష్యం కారణంగానే ఫెన్సింగ్ పనులు కొనపాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని విలువైన భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా నిఘాను బలోపేతం చేయాలని ప్రతిపాదించినా అన్ని చోట్ల ఈ వ్యవస్థ అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రత్యక్షంగా భద్రత సదుపాయం కల్పించలేని ప్రాంతాల్లో జియోఫెన్సింగ్ ద్వారా భూముల రక్షణకు చర్యలు తీసుకోవాలని భావించినా ఆ ప్రణాళికలు ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఉండటం గమనార్హం.
చదవండి: ఇక ఫ్యూచర్ సిటీలో లేఔట్లు.. ఎఫ్‌సీడీఏ పర్మిషన్లు