ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిపై హైకోర్టు సీరియస్
27లోగా ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకోవాలి.. లేదా విద్యా, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు కోర్టుకు రావాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల అమలు ప్రతిపాదనలను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులు తిరస్కరించలేరని హైకోర్టు స్పష్టం చేసింది. గరిష్టంగా నిబంధనల ప్రకారం ఫైల్‌ను పరిశీలించి, అవసరమైన అభిప్రాయాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చని పేర్కొంది. కోర్టు ఆదేశాల అమలును అడ్డుకునేలా ఫైల్‌ను పదేపదే వెనక్కి పంపడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు ఆదేశాలను తిరస్కరించగలరా’అని ప్రభుత్వ న్యాయవాదిని సూటిగా ప్రశ్నించింది.
అందుకు జీపీ బదులిస్తూ.. తిరస్కరించలేరు, గరిష్టంగా తగిన ఆదేశాల కోసం ఫైల్‌ను ఉన్నతస్థాయికి పంపొచ్చు అని సమాధానమిచ్చారు. ‘మరి ఆర్థికశాఖ ముఖ్య కార్య దర్శి ఫైల్‌ను ఎందుకు ఆపుతు న్నారు? కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఎందు కు వెనక్కి పంపుతున్నారు? ఆయనకు ఏం సమ్మతి కావాలి? అసలు ఆయన పాత్ర ఏమిటి?’అని నిలదీసింది. తదుపరి విచారణలోగా ఆదేశాలు అమలు చేయని పక్షంలో విద్యాశాఖతో పాటు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని, న్యాయస్థానం తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది.
బాధితులు ఎన్నాళ్లు వేచి ఉండాలి..
తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు 1997లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2000లో ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై అదే సంవత్సరం వర్సిటీ అప్పీల్‌కు వెళ్లినా.. 2025లో అక్కడ కూడా ఉద్యోగులకే ఉపశమనం లభించింది. అయినా.. తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కింద పరిగణించడం లేదంటూ 31 మంది హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
గత విచారణ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా హాజరుకు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుద్దాల చలపతిరావు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. యోగితారాణా ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ప్రతిపాదనను ఆర్థికశాఖకు మూడుసార్లు పంపినా తిరిగి పంపినట్టు న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై కోర్టు తీవ్రంగా స్పందించింది.
అమలు కాకుంటే తీవ్ర చర్యలు..
ఆర్థికశాఖ పాత్ర ప్రధానంగా ఆర్థికపరమైన పరిశీలన, ఆడిట్ ప్రక్రియ అంశాలకే పరిమితమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పుడు వాటిని అమలు చేయకుండా ఫైల్‌ను నిలిపివేయడానికి ఆర్థిక ముఖ్య కార్యదర్శికి అధికారం లేదన్నారు. మధ్యాహ్నం 2.30కి ఆర్థిక ముఖ్య కార్యదర్శిని ఆన్‌లైన్‌లో హాజరై వివరణ ఇవ్వాలని చెప్పారు.
సాధారణంగా శాఖ నుంచి ప్రతిపాదన ఫైనాన్స్ శాఖకు వెళ్తుందని, అక్కడి అభిప్రాయాల అనంతరం జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ద్వారా ఫైలు మళ్లీ పంపించి, చివరకు సీఎం ఆమోదానికి వెళ్తుందని ప్రభుత్వ న్యాయవాది రాహుల్‌రెడ్డి వివరించారు. ఆర్థిక ముఖ్యకార్యదర్శి నుంచి సమ్మతి పొందేలా చర్యలు తీసుకుంటామని, కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 27కు వాయిదా వేసింది. 27లోగా ఆదేశాలు అమలు కాకపోతే చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది.


