
హత్య కేసులో ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసిన హైకోర్టు
సాక్షి చెప్పినదానికి, మెడికల్ ఆధారాలకు సారూప్యత లేదని వెల్లడి.. నిందితుడు షంషీర్‌ను విడుదల చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాక్షులు, మెడికల్ ఆధారాల్లో వ్యత్యాసం ఉండి.. ప్రత్యక్ష సాక్షి చెబుతున్నది సందేహాస్పదంగా ఉన్నప్పుడు శిక్షలు విధించడం సాధ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. ఫిర్యాదు చేసిన తర్వాత అది కోర్టుకు చేరడానికి పదహారున్నర గంటల సమయం పట్టిందని.. ఇంత సమయం ఎందుకు పట్టిందో దర్యాప్తు అధికారి వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. ఆలస్యం పరిస్థితులను ప్రశ్నార్థకంగా మారుస్తుందని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొంది.
ప్రత్యక్ష సాక్షి (పీడబ్ల్యూ 6) వాంగ్మూలం ప్రకారం.. కార్తీక్ చేతిపై షంషీర్ ఖాన్ దాడి చేశాడని.. తలపై దాడి చేసినట్లు పేర్కొనలేదని చెప్పింది. కానీ, పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పుర్రెపై బలమైన గాయం కారణంగా కార్తీక్ మరణించినట్లు ఉందని చెప్పింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రధానంగా అతని వాంగ్మూలంపై ఆధారపడ్డారని అభిప్రాయపడింది.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని 2018లో ఆదిలాబా ద్ జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నామని తెలిపింది. నిందితుడు షంషీర్‌పై ఇతర కేసులు లేకుంటే వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.సురేందర్, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 ప్రస్తావన లేదు..
పోలీసుల కథనం మేరకు.. ‘ఓ అమ్మాయికి సంబంధించిన విషయంలో షంషీర్, కార్తీక్‌కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో కాగజ్‌నగర్‌లోని లారీ చౌరస్తాలో కార్తీక్‌ను షంషీర్ కత్తితో దాడి చేసి చంపాడు. 2014, ఫిబ్రవరి 20న కార్తీక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత షంషీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.’ ఈ కేసు విచారణ చేపట్టిన ఆదిలాబాద్ జిల్లా కోర్టు.. షంషీర్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ 2018లో తీర్పునిచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ షంషీర్ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో షంషీర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి, పోలీసుల తరఫున ఏపీపీ అరుణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ‘కోర్టుకు పంపిన ఫిర్యాదులో పీడబ్ల్యూ 6 పేరు ప్రస్తావించలేదు. విచారణ సమయంలోనూ అతని పేరు లేదు. పీడబ్ల్యూ 6 చెప్పిన దానికి మెడికల్ ఆధారాలు విరుద్ధంగా ఉన్నాయి.
మరణించిన వ్యక్తి తల, మెడపై దాడి జరిగిందని సాక్షి చెప్పలేదు. మెడికల్ ఆధారాల్లో తల, మెడ, ఎడమ చెవిపై గాయాలున్నాయి. ఎడమ మణికట్టు వద్ద కూడా గాయాలున్నాయి. పీడబ్ల్యూ 6 సాక్షాలు సందేహాస్పదంగా ఉన్నా యి. అందువల్ల 2018లో ఇచ్చిన తీర్పును రద్దు చేస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
న్యాయం గెలిచింది
ఎనిమిదేళ్లుగా జైలు జీవితం గడిపి ఈ రోజే విడుదలయ్యాను. శిక్షా కాలంలో సెంట్రల్ జైలు, వరంగల్‌లో ఓపెన్ జైలు పెట్రోల్ బంకులో పని చేశాను. ఇన్నేళ్లకు మళ్లీ న్యాయం గెలిచిందని నమ్ము తున్నాను. నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. – షంషీర్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment