TS: తెలంగాణలో మూడ్రోజులు భారీ వర్షాలు | Heavy rains for three days in Telangana | Sakshi
Sakshi News home page

TS: తెలంగాణలో మూడ్రోజులు భారీ వర్షాలు

Sep 24 2026 5:44 AM | Updated on Sep 24 2026 5:44 AM

Heavy rains for three days in Telangana

ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ 

వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌–దక్షిణ ఒడిశా తీరాల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీంతో మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 

ఈ మేరకు ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 

గురువారం తూర్పు, ఈశాన్య జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, శుక్రవారం ఉత్తర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, మిగిలిన ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.  

జిల్లాల్లో సాధారణం.. 
ఈనెల 30వ తేదీతో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగుస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 70.96 సెం.మీ. సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 56.78 శాతం మాత్రమే నమోదైంది. సాధారణంగా కురవాల్సిన వర్షం కంటే 20 శాతం లోటు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కాగా 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే కేవలం ఒక్క మండలంలో అతిభారీ వర్షాలు కురిశాయి. 35 మండలాల్లో అధికం, 242 మండలాల్లో సాధారణం, 333 మండలాల్లో లోటు, 10 మండలాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది. 

రాజుపేట శివారులో కూలిన వంతెన 
ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేట శివారు పాములేరు వాగుపై బ్రిడ్జి కూలిపోయింది. భారీ వర్షాలకు వంతెన రెండు ఖానాలు నేలమట్టం కాగా, మరో రెండు ఖానాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ ఘటన బుధవారం రాత్రి వెలుగు చూసింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడం, కొట్టుకొచి్చన భారీ చెట్ల కొమ్మలు, మొట్లు ఖానాలకు అడ్డు పడటంతో వంతెన పిల్లర్లు కోతకు గురైనట్లు తెలిసింది. బ్రిడ్జి కూలడంతో పాల్వంచ–మందలపల్లి ఆర్‌అండ్‌బీ రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. హైలెవల్‌ వంతెన కూలి రాకపోకలు నిలిచిపోయినా అధికారులెవరూ కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్సై మధుప్రసాద్‌ వినాయక నిమజ్జనం విధుల్లో మరో ప్రాంతానికి వెళ్లగా స్థానికంగా సిబ్బందే విధులు నిర్వర్తిస్తున్నారు. చివరకు విద్యుత్‌ శాఖ, గిర్దావర్, జీపీపీ వచి్చనా ఆర్‌అండ్‌బీ, మండల పరిషత్‌ అధికారుల జాడే లేదు.

భారీ వర్షాలపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి జిల్లాలో 24 గంటలూ అందుబాటులో ఉండే కంట్రోల్‌ రూమ్, టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను పొంగులేటి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాగులు, చెరువులు, వరద ప్రవాహ ప్రాంతాల వైపు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement