తెలంగాణలో దంచికొట్టిన వాన

Heavy Rains Lashes Hyderabad Several Districts In Telangana - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు 

హైదరాబాద్‌ నగరం, శివార్లలో పలుచోట్ల కుండపోత 

బంగాళాఖాతంలో అల్పపీడనమే కారణం 

నేడు కూడా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు  

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యం గా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి కుండపోత కురవగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్‌ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతోనే వానలు పడుతున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. భారీ వర్షంతో హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

చెరువులు, నాలాలు పొంగిపొర్లడంతో పలు కాలనీలు, రహదారులు జలమయం అయ్యాయి. పలుచోట్ల రెండు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అయితే దసరా సెలవులతో ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా.. శనివారం సాయంత్రం 4గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో అత్యధికంగా 10.05 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో 9.83, హైదరాబాద్‌ జిల్లా అంబర్‌పేట్‌లో 9.65, సూర్యాపేట జిల్లా నాగారంలో 9.53 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

నేడూ వానలు: బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీనితో ఆదివారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల భారీ వర్షాలూ పడొచ్చని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

వాన.. హైరానా.. 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన వాన రైతులను పరుగులు పెట్టింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలాల్లో ధాన్యం తడిసి పోయింది. వాన నీటిని తొలగించి, ధాన్యం ఎత్తేందుకు రైతులు నానా అవస్థలు పడ్డారు. బోధన్, మోర్తాడ్, నిజామాబాద్‌ రూరల్, డిచ్‌పల్లి తదితర మండలాల్లో వరి పంట నేలకొరిగింది. 

జడ్చర్లలో నాలాలో పడి యువకుడి మృతి 
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో శనివారం కుండపోత వానతో పలు కాలనీలు నీటమునిగాయి. వంట సామగ్రి, నిత్యవసర సరుకులు, ఇతర వస్తువులు తడిపోవడంతో జనం ఆందోళనలో మునిగిపోయారు. సిగ్నల్‌గడ్డ–నేతాజీ రోడ్డు జలమయమై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాల్మీకినగర్‌కు చెందిన రాఘవేందర్‌ (35) అనే వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి చనిపోయాడు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో సైతం భారీ వర్షం కురిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top