
శుక్రవారం రాత్రి భారీ వర్షానికి గచ్చిబౌలి ప్రాంతంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం
కంటోన్మెంట్, బోయిన్‌పల్లిలో అత్యధికంగా 11.5 సెం.మీ..
వాగుల్ని తలపించిన రోడ్లు.. ఫ్లైఓవర్లపైనా వరద ప్రవాహం
స్తంభించిన ట్రాఫిక్.. గంటలకొద్దీ నిలిచిపోయిన వాహనాలు
రంగంలోకి జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి, ఎమర్జెన్సీ బృందాలు
పూర్తిగా మునిగిన ప్యాట్నీనగర్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత రెండు, మూడు గంటల పాటు కురిసిన అతి భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొన్నిచోట్ల వరద ఉధృతికి ఆటోలు, ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు కొట్టుకు పోయాయి. నగరం నలుమూలలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

ప్యాట్నీ నగర్‌లో వరదలో చిక్కుకున్న వారిని పడవల ద్వారా తరలిస్తున్న సహాయక సిబ్బంది
కంటోన్మెంట్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 6 సెం.మీ పైగా వర్షం కురిసింది. ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన వారు నరకయాతన పడ్డారు. రోడ్లపై మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తుండటంతో మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకులు వద్ద గంటల కొద్దీ తలదాచుకున్నారు.

ఎటు చూసినా వరదే..
హైదరాబాద్‌లోని మాదాపూర్ నెక్టార్ గార్డెన్ వద్ద, ఎల్‌బీనగర్, మలక్‌పేట, మూసారంబాగ్, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లపై వరద వాగుల్ని తలపించింది. షేక్‌పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చి»ౌలి, కొండాపూర్, హఫీజ్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, ఏఎంబీ మాల్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. టోలిచౌకి నానల్ నగర్ జంక్షన్ వద్ద నాలా పొంగిపొర్లింది. పాతబస్తీలోని డబీర్‌పురా, శివగంగా నగర్, రాజన్న బావి, ఛత్రినాక చౌరస్తా, అచ్చయ్య నగర్, హనుమాన్ నగర్, అంబికా నగర్, పటేల్ నగర్ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చింతల్‌బస్తీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, లక్డీకాపూల్, శ్రీనగర్ కాలనీ, శ్రీకష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్, వెంకటగిరి, అమీర్‌పేట తదితర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫిలింనగర్‌లోని పలు బస్తీల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. ఉప్పల్, రామాంతపూర్, అంబర్‌పేట, తార్నాక, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

ట్రాఫిక్ పద్మవ్యూహంలో నగరం
రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోయాయి. అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సాయంత్రం కార్యాలయాలు, కాలేజీలు, పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో ఎక్కడ చూసినా వాహనాల బారులు కిక్కిరిసిపోయి కని్పంచాయి. ప్రధానంగా ఐటీ కారిడార్ రాయదుర్గం, షేక్‌పేట్ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాయదుర్గం, బయో డైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచి్చ»ౌలి పీజేఆర్ ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

నాంపల్లి, మెహదీపట్నం, టోలిచౌకి మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హఫీజ్‌పేట్, ఆల్విన్ కాలనీ, చందానగర్ మార్గంలో కిలోమీటరు ప్రయాణానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అంబర్‌పేట పటేల్‌నగర్, ప్రేమ్‌నగర్, అలీకేఫ్ చౌరస్తాల్లో, బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చౌరస్తా మాదాపూర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అమీర్‌పేట, పంజగుట్ట, ఖైరతాబాద్, మాసబ్‌ట్యాంక్, ఎన్‌ఎఫ్‌సీఎల్ చౌరస్తా, విరించి ఆస్పత్రి చౌరస్తా, యూసుఫ్‌గూడ శ్రీకష్ణానగర్ రోడ్లలో ట్రాఫిక్ నిలిచిపోయింది. మూసారంబాగ్ బ్రిడ్జిని వరద ముంచెత్తింది.
సహాయక కార్యక్రమాలు పర్యవేక్షించిన హైడ్రా కమిషనర్
వరద ఉధృతికి సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ప్యాట్నీనగర్ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపునీరు చేరింది. దీంతో నాలుగు పడవల ద్వారా అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను, వివిధ కార్యాలయాల్లో ఉన్న ఉద్యోగులు సుమారు 80 మందిని బయటకు తీసుకొచ్చారు. ఫైరింజన్ ద్వారా వర్షపు నీటిని తోడారు. మొదటి. రెండవ అంతస్తులో నివాసం ఉంటున్న స్థానికులు ఇళ్లను విడిచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సహాయ కార్యక్రమాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం...
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన విద్యుత్ అధికారులు సిబ్బందిని రంగంలోకి దింపి దాదాపు 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరా పునరుద్ధరించినట్లు ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్ ఫరూఖి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి పడడంతో సరఫరా పునరుద్ధరణకు కొంత అదనపు సమయం పట్టిందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, హైడ్రా మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి ప్రధాన వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మొయినాబాద్ మండలం నదీమ్‌నగర్ గ్రామంలో మైసమ్మ దేవాలయం వద్ద దాదాపు 200 ఏళ్ల వయసున్న వేప చెట్టు నేలకొరిగింది.