సంక్రాంతి పండుగ మనవడితో సంతోషంగా చేసుకోవాలనుకున్నాడు.. అంతలోనే..

Grand Father and Grandson Fell in Maneru River peddapalli - Sakshi

సాక్షి, కాల్వశ్రీరాంపూర్‌(పెద్దపల్లి): సంక్రాంతి పండుగకు తన మనవడిని తీసుకువస్తున్న ఓ వ్యక్తి మానేరు నదిలో ఆ చిన్నారితో సహా గల్లంతయ్యాడు.. బాబు మృతదేహం లభ్యమవగా తాత ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై వెంకటేశ్వర్‌ కథనం ప్రకారం.. మీర్జంపేటకు చెందిన మార్క దేవేందర్‌(45)కు ఇద్దరు భార్యలు ఇందిర, కొమురమ్మ, కుమారులు బాలు, సాయి, వెంకటేశ్, కూతురు మౌనిక, తల్లిదండ్రులు ఉన్నారు. కూతురు మౌనికకు వీణవంక మండలం కిష్టంపేటకు చెందిన కోల శ్రీనివాస్‌తో వివాహం జరిపించారు. ఈ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. అక్కడ శ్రీనివాస్‌ కూలి పనులు చేస్తున్నాడు. వీరికి యశ్వంత్‌(9), ఏడాది వయసున్న ఒక పాప ఉన్నారు.

స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో దేవేందర్‌ తన మనవడిని తీసుకువచ్చేందుకు హైదరాబాద్‌ వెళ్లాడు. సోమవారం యశ్వంత్‌ను తీసుకొని మీర్జంపేటకు బయలుదేరాడు. రైలెక్కి, జమ్మికుంటలో దిగి, ఆర్టీసీ బస్సులో వావిలాలకు వచ్చారు. అక్కడి నుంచి కాలినడకన మానేరు నది దాటుతూ స్వగ్రామం మీర్జంపేటకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఇద్దరూ జారి, నీటిలో పడ్డారు. కొంత దూరంలో ఉన్న రైతులు గమనించి, గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్‌ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు చేపట్టారు.

చదవండి: (‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’)

గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టగా యశ్వంత్‌ మృతదేహం లభ్యమైంది. రాత్రి వరకు వెతికినా దేవేందర్‌ ఆచూకీ లభించలేదు. ప్రమాద విషయం తెలుసుకున్న యశ్వంత్‌ తల్లిదండ్రులు హైదరాబాద్‌ నుంచి బయలుదేరినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దుర్ఘటనతో మీర్జంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎమ్మెల్యే
మానేరు నదిలో గల్లంతై, మృతి చెందిన మార్క దేవేందర్, ఆయన మనవడు యశ్వంత్‌ల కుటుంబసభ్యులను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహార్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సంఘటన దురదృష్టకరమని, ఇరు కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ నూనేటి సంపత్‌యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు వంగళ తిరుపతి రెడ్డి, సర్పంచ్‌ నాగార్జున్‌రావు, నాయకులు దేవేందర్, సదానందం, కొమురయ్య, ఓదెలు తదితరులున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top