ధాన్యానికి ‘తేమ’ కొర్రీ | Sakshi
Sakshi News home page

ధాన్యానికి ‘తేమ’ కొర్రీ

Published Wed, May 15 2024 6:04 AM

grain is not being purchased for farmers protest: ts

కొనుగోలు కేంద్రాల్లో రైతన్నల పాట్లు  

17 శాతం తేమ వస్తేనే కాంటా వేస్తామంటున్న నిర్వాహకులు 

అకాల వర్షాలతో రెండు మూడుసార్లు తడిసిన ధాన్యం

అమలుకు నోచుకోని పౌరసరఫరాల శాఖ హామీలు 

మళ్లీ వర్ష సూచనతో ఆందోళనలో రైతాంగం

ఈ చిత్రంలోని  రైతు దంపతులు మీసా పరుశరాములు, రేణుక (రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌) 2.20 ఎకరాల సొంత భూమితో పాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు. పండిన ధాన్యాన్ని 17 రోజుల క్రితం ముస్తాబాద్‌లోని కొనుగోలు కేంద్రానికి తెచ్చారు. కానీ ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. అప్ప ట్నుంచి ఇప్పటివరకు మూడుసార్లు వర్షాలతో ధాన్యం తడిసింది. ఇప్పుడు 17% తేమ వచ్చే వరకు కొనలేమని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, ఈలోగా మళ్లీ వర్షం పడటం, మళ్లీ ఆరబెట్టడం నిత్యకృత్యంగా మారడంతో ఈ దంపతులు లబోదిబోమంటున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: తడిచిన ధాన్యాన్ని సైతం కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలుస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఆ శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఇచి్చన హామీలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ రైతులు రోజుల తరబడి వేచి చూస్తున్నా.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 17 శాతం తేమ వచ్చేదాకా ధాన్యం కాంటా వేయలేమని కరాఖండిగా చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఇప్పటికే చాలాసార్లు తడిచింది. ధాన్యం తడవడం, రైతులు ఆరబెట్టేందుకు అష్టకష్టాలూ పడటం నిత్యకృత్యమైంది. మరోవైపు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చేస్తున్న సూచనలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

45 రోజుల్లో 27 ఎల్‌ఎంటీలే సేకరణ 
రాష్ట్రంలో గత 15 రోజుల నుంచి అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు రైతుల పంటను నీళ్లపాలు చేస్తున్నాయి. వర్షం పడిన ప్రతిసారీ పౌరసరఫరాల శాఖ తడిచిన ధాన్యం కొంటామనే హామీ ఇవ్వడమే తప్ప అమలుపై శ్రద్ధ చూపించడం లేదు. దీంతో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతుల వడ్లు పలుమార్లు నీళ్లలో తడిశాయి. చాలాచోట్ల ధాన్యం వరదల్లో కొట్టుకుపోయింది.

ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మొదలై 45 రోజులు దాటినప్పటికీ, ఇప్పటివరకు 27 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. నల్లగొండ, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్, మెదక్‌ జిల్లాల్లో సైతం కోతలు దాదాపుగా ముగిశాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో కోతలు కొంత ఆలస్యం అయ్యాయి. అయితే వరి కోసి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తెస్తున్న రైతులు అక్కడే ఆరబెట్టి, తమ వంతు వచ్చేంత వరకు కాంటా కోసం వేచిచూస్తున్నారు.

రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్, బ్యాంక్‌ పాస్‌బుక్‌ ఫోన్‌ నంబర్‌తో లింక్‌ అయితేనే కొనుగోళ్లు జరుపుతుండడంతో కొందరు రైతులతో పాటు కౌలు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా తేమ 17 శాతానికి చేరుకునే వరకు వేచి ఉండాలని చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మిల్లర్ల కొర్రీలు 
మరోవైపు కొంచెం తేమ శాతం ఎక్కువగా ఉన్నా మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టిన తరువాత ధాన్యం రంగు మారినా తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. అలాంటి ధాన్యం లోడ్‌లు మిల్లులకు వస్తే నేరుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైతులకు ఫోన్లు చేసి పచ్చి ధాన్యాన్ని తీసుకోబోమని తేల్చిచెబుతున్నారు. తీసుకునే పక్షంలో క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల తరుగు తీయాల్సి ఉంటుందంటూ మెలిక పెడుతున్నారు.

ధాన్యం కాంటాకే ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు విధిలేని పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పినట్లు వింటూ దోపిడీకి గురవుతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ ఈ అంశంపై దృష్టి సారించి తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

అకాల వర్షంతో తడిచిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొంటాం.  – ఇటీవల హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి 

Advertisement
 
Advertisement
 
Advertisement