- ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో రెండు రోజుల కిందటే జిష్ణుదేవ్ గ్రీన్‌సిగ్నల్
- ప్రజా ప్రతినిధి కావడంతో పాటు, గతంలో మంత్రిగా పని చేసినందున అనుమతి కోరిన ఏసీబీ
- రూ.54.88 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు బదిలీ అయ్యాయనే ఆరోపణలు
- గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఈ కేసులో చార్జిషిట్ వేసేందుకు మార్గం సుగమం!
- అర్వింద్‌కుమార్ విచారణకు డీవోపీటీ నుంచి ఇంకా రాని అనుమతి
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.54.88 కోట్ల హెచ్‌ఎండీఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు చెల్లించారంటూ నమోదైన కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మాజీ మంత్రి కేటీ రామారావును ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించారు. ఈ మేరకు రెండురోజుల క్రితమే గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి సమాచారం వెళ్లిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది.
ప్రజా ప్రతినిధి కావడంతో పాటు, గతంలో మంత్రిగా పని చేసినందున.. కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి కోరుతూ ఏసీబీ గతంలో లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఈ కేసులో ఏసీబీ వేగం పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. గవర్నర్ అనుమతి రావడంతో ఈ కేసులో చార్జిషీట్ వేసేందుకు ఏసీబీ అధికారులకు అవకాశం చిక్కినట్టయ్యింది. అయితే ఇదే కేసులో ఏ–2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ పైనా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అందుకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి తప్పనిసరి. ఆ అనుమతి వస్తేనే ఈ కేసులో చార్జిషీట్ ప్రక్రియ వేగవంతం అవుతుందని ఏసీబీ అధికారులు అంటున్నారు.
ఇదీ కేసు నేపథ్యం..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్ వద్ద ఫార్ములా–ఈ కార్ రేస్ నిర్వహించారు. అయితే ఈ రేస్ నిర్వహణ కోసం బ్రిటన్‌కు చెందిన ఫార్ములా–ఈ ఆపరేషన్స్, హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌కో సిస్టర్ కంపెనీ ఏస్ నెక్ట్స్ జెన్, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం మేరకు హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో సీజన్ 9, 10, 11, 12 నిర్వహణ కోసం ట్రాక్ నిర్మాణం సహా ఇతర మౌలిక సదుపాయాలను ఎంఏయూడీ కల్పించాలి. 2023 ఫిబ్రవరి 11న సీజన్ 9 నిర్వహించారు. అయితే వివిధ కారణాలతో ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో కార్ రేస్ నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వానికి ఆ సంస్థ సమాచారం అందించింది. దీంతో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అరి్వంద్‌కుమార్ నేతృత్వంలో.. ఫార్ములా–ఈ ఆపరేషన్స్, ఎంఏయూడీ మధ్య 2023 అక్టోబర్‌లో మరో కొత్త ఒప్పందం జరిగింది.
రూ.54.88 కోట్ల దుర్వినియోగం ఆరోపణలతో ఏసీబీ కేసు
ఈ– కార్ రేస్ ఈవెంట్ నిర్వహణ కోసం స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (గ్రేట్ బ్రిటన్ పౌండ్లు 90,00,000) చెల్లించాలని అగ్రిమెంట్‌లో పేర్కొన్నారు. ఈవెంట్ నిర్వహణకు అవసరమైన మున్సిపల్ సేవలు, సివిల్ వర్క్స్ కోసం మరో రూ.50 కోట్లు ఖర్చు చేసే విధంగా అండర్ టేకింగ్ తీసుకున్నారు. ఇలా హెచ్‌ఎండీఏ బోర్డుకు సంబంధించిన నిధుల నుంచి మొత్తం రూ.160 కోట్లు మంజూరు చేసేలా ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీజన్ 10 నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్ 3, 11వ తేదీలలో హెచ్‌ఎండీఏ బోర్డు సాధారణ నిధుల నుంచి ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీ రూపంలో ట్రాన్స్‌ఫర్ చేశారు.
అయితే ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ఐటీ శాఖ హెచ్‌ఎండీఏకి రూ.8.07 కోట్ల జరిమానా విధించింది. ఇలా ఈ మొత్తం వ్యవహారంలో హెచ్‌ఎండీఏ బోర్డు ఖజానా నుంచి మొత్తం రూ.54,88,87,043 దురి్వనియోగం అయ్యాయని ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. రూ.54.88 కోట్ల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మొత్తం 10 మందిపై కేసులు
ఈ కేసులో ఏ–1గా కేటీఆర్, ఏ–2గాఅరి్వంద్‌కుమార్, ఏ–3గా హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డి ఉన్నారు. అలాగే నెక్ట్స్ జెన్‌కు చెందిన కిరణ్‌రావు, ఫార్ములా–ఈ ఆపరేషన్స్ ప్రతినిధులు సహా మొత్తం 10 మందిపై కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి దర్యాప్తులో భాగంగా ఏసీబీ అధికారులు పలు దఫాలుగా నిందితులను ఇప్పటికే విచారించారు. కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డిలను రెండుసార్లు ప్రశ్నించారు. ఫార్ములా–ఈ ఆపరేషన్స్ ప్రతినిధులను సైతం ఆన్‌లైన్‌లో విచారించారు.
కాగా ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ కేసు గురించి పలుమార్లు ప్రస్తావించారు. బీజేపీతో బీఆర్‌ఎస్ కుమ్మక్కవడం వల్లే కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. అయితే ప్రస్తుతం కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. బీజేపీతో బీఆర్‌ఎస్ కుమ్మక్కు ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయం తాజా పరిణామంతో రుజువయ్యిందని బీఆర్‌ఎస్‌కు చెందిన సీనియర్ నేతలు పలువురు వ్యాఖ్యానించారు.


