అరగంటలో ‘మ్యుటేషన్‌’

Government Arranged Software In Dharani Portal Fast Mutation Of Properties - Sakshi

వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం

23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సేవలు

క్రయ, విక్రయదారులు, సాక్షుల హాజరు తప్పనిసరి

ఆన్‌లైన్‌లోనే మ్యుటేషన్‌ ఫీజు, రిజిస్ట్రేషన్‌ రుసుము చెల్లింపు  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని వ్యవసాయే తర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అరగంటలో పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ కూడా వేగంగా పూర్తయ్యేలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనుంది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో ఈ నెల 23 నుంచి ఈ సేవలు అందు బాటులోకి రానున్నాయి. గ్రామ పంచా యతీలు, మున్సిపల్‌ కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లోనే మ్యుటేషన్లు పూర్తి కానున్నాయి. 

సరళీకృత ఫార్మాట్‌లో..
వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం సులభతరమైన, సరళీకృత విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఈ విధానం ప్రకారం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడి, క్రయవిక్రయ రిజిస్ట్రేషన్‌ లావాదేవీల కోసం ధరణి పోర్టల్‌లోని ఎరుపు రంగు విండో (నాన్‌ అగ్రికల్చర్‌)ను క్లిక్‌ చేసిన తర్వాత వచ్చే పేజీలో ‘సిటిజన్‌ స్లాట్‌ బుకింగ్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. సిటిజన్‌ లాగిన్‌ పేజీలో మొబైల్‌ నంబర్‌ నమోదు చేయగానే వచ్చే పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంట్‌ నంబర్, క్రయ, విక్రయదారులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం నమోదు చేయాలి.

స్లాట్‌ బుక్‌ కాగానే అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడి మొబైల్‌ నంబర్‌కు సమాచారం వస్తుంది. ఆ సమాచారం ప్రకారం అమ్మకందారులు, కొనుగోలుదారులు, సాక్షులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు స్లాట్‌ బుకింగ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ దస్తావేజుకు సంబంధించిన డేటా ఎంట్రీ చేస్తారు. నిర్దేశిత స్టాంపు డ్యూటీ, ఇతర చార్జీలను ఆన్‌లైన్‌లో ఈ–చలాన్‌ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సాక్షులు, క్రయ, విక్రయదారుల వివరాలు, బయోమెట్రిక్‌ ఆధారాలను డేటా ఎంట్రీ ఆపరేటర్‌ తీసుకుంటారు. ఇది పూర్తికాగానే సబ్‌ రిజిస్ట్రార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు మళ్లీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తారు. వెంటనే మ్యుటేషన్‌ సిగ్నేచర్‌ కోసం సబ్‌ రిజిస్ట్రార్‌కు పంపిస్తారు. ఈ సంతకం చేయడంతోనే సదరు భూమి లేదా ఆస్తి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

నేటి నుంచి ట్రయల్‌ రన్‌ ..
బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన ధరణి వార్‌రూంలో వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి రోజుకు 10 రిజిస్ట్రేషన్ల చొప్పున మూడు రోజులపాటు అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నారు. ధరణి సాఫ్ట్‌వేర్‌ పనితీరును పరిశీలించనున్నారు. ఈ నెల 23న నుంచి స్లాట్‌ బుకింగ్‌ ద్వారా పూర్తిస్థాయిలో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top