సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి సమీక్షా సమావేశాలు జరుగనున్నాయి. ప్రతి రోజు వేర్వేరు అంశాలపై అధికారులు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు.
నవంబర్ 25 – సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లు
సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు సంబంధిత విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొని సమ్మిట్ నిర్వహణ, కీలక కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు.
నవంబర్ 26న లాజిస్టిక్స్, ఇతర ఏర్పాట్ల గురించి సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పాల్గొంటారు. సమ్మిట్‌కు వచ్చే దేశీయ, విదేశీ ప్రతినిధుల రవాణా, నివాసం, భద్రత వంటి లాజిస్టిక్స్ అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
నవంబర్ 27న జరగనున్న సమావేశానికి మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కానున్నారు. సమ్మిట్ వేదిక, రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్, అతిథి సదుపాయాలు మొదలైన మౌలిక వసతులపై అధికారులు సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు.
నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు సీఎం, మంత్రి వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి పాల్గొని విద్యాసంస్థల భాగస్వామ్యం, యువజన కార్యక్రమాలపై సమీక్షిస్తారు.
దాంతో పాటు ఆ రోజు సాయంత్రం 6 గంటలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పాల్గొని పర్యాటక ప్రోత్సాహక ప్రణాళికలను పరిశీలించనున్నారు.
నవంబర్ 29న సాయంత్రం 4 గంటలకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వాకాటి శ్రీహరి పాల్గొనబోతున్నారు. రైతులకు కొత్త అవకాశాలు, సమ్మిట్‌లో అగ్రి–ఇన్నోవేషన్ సెషన్లపై చర్చించనున్నారు.
సాయంత్రం 6 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, మోహమ్మద్ అజరుద్దీన్ పాల్గొని సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించనున్నారు.
నవంబర్ 30న సీఎంతో పాటు ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ, సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ టూరిజం అవకాశాలు, గ్లోబల్ హెల్త్ సెషన్లపై సమగ్ర సమీక్ష జరుగుతుంది.


